నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయవద్దు.. అవి రైతులకు అనుకూలమే..

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా రైతులు ధర్నా చేస్తుంటే మరికొన్ని రాష్ట్రాల రైతు సంఘాల సభ్యులు మాత్రం వాటికి మద్దతు పలుకుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసి తమ మద్దతు నివేదికను సమర్పించారు. దీంతో ఈ విషయం ఇప్పడు హాట్‌టాఫిక్‌గా మారింది.

నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలంగానే ఉన్నాయి అందుకే మేము మద్దతు ఇస్తున్నామని నివేదికలో పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. అలాగే నూతన చట్టాలను వెనక్కి తీసుకోవద్దని సూచించారు. తోమర్‌ను కలిసిన వారిలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, బిహార్, హరియాణా, ఆల్ ఇండియా కిసాన్ సమన్వయ సమితి సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికే ఈ చట్టాలకు రూపకల్పన చేశారన్నారు. ఆయన అనుభవాలను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తనతో చర్చించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా రైతులందరు నూతన వ్యవసాయ చట్టాల ఆవశ్యకతను తెలుసుకోవాలని సూచించారు.