ప్రజాస్వామ్యమే గెలిచింది: బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నిక అధికారికంగా ఖరారయింది. రాజ్యాంగ నియమాల ప్రకారం సోమవారం అన్ని రాష్ట్రాల ఎలక్టోరల్‌ కాలేజీలు సమావేశమయ్యాయి. అధ్యక్షుడిగా జో బైడెన్‌ను, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను ఎలక్టర్లు ఎన్నుకున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ స్థానాలకుగానూ బైడెన్‌ 302 కైవసం చేసుకున్నారు. దీంతో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న న్యాయపోరాటానికి తెరపడినట్లయింది.

ఈ సందర్భంగా బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలు, సంప్రదాయాలు కఠిన పరీక్ష ఎదుర్కొన్నాయని తెలిపారు. అయినా, వ్యవస్థలు ఏమాత్రం సడలలేదని స్పష్టం చేశారు. పరోక్షంగా ఫలితాల్ని మార్చేందుకు ట్రంప్‌ చేసిన ప్రయత్నాల్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి అమెరికన్‌ గుండెలోకి ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే పదం చొచ్చుకుపోయిందన్నారు. అమెరికాలో రాజకీయనాయకులు అధికారం తీసుకోరని.. ప్రజలు వారికి అప్పజెబుతారని గుర్తుచేశారు. ”ప్రజాస్వామ్యం అనే దీపాన్ని అనేక ఏళ్ల క్రితమే అమెరికాలో వెలిగించారు. ఏ మహమ్మారియైనా.. ఎంతటి అధికార దుర్వినియోగమైనా.. ఆ దీపాన్ని ఇక ఆర్పలేవు” అని వ్యాఖ్యానించారు. తాను అమెరికావాసులందరికీ.. అధ్యక్షుడిగా ఉంటానన్నారు. తనకు ఓటు వేయని వారి సంక్షేమం కోసం మరింత ఎక్కువ శ్రమిస్తానని వ్యాఖ్యానించారు.అమెరికా ప్రజాస్వామ్యం ఎన్నో అవరోధాలను, బెదిరింపులను ఎదుర్కొన్నదని, కానీ మన ప్రజాస్వామ్యం బలంగా ఆ ఒడిదిడుకులను ఎదుర్కొన్నట్లు బైడెన్ తెలిపారు. అమెరికా చరిత్రలో పేజీని మార్చాల్సిన సందర్భంగా వచ్చిందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎలక్టోరల్ కాలేజీ ప్రకటన బైడెన్‌కు కీలకమైంది.

అమెరికా ఎన్నికల విధానంలో ఓటర్లు నేరుగా ఎలక్టర్స్‌ను ఎన్నుకుంటారు. వారంతా కొన్ని వారాల తర్వాత దేశాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఓటేస్తారు. నవంబర్ 3వ తేదీన జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో జోసెఫ్ బైడెన్ 302 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకున్నారు.