ఏపీలో నేటి నుంచి తెరచుకున్న విద్యా సంస్థలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు నెలల అనంతరం పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 9, 10 తరగతులకి నేటినుంచి క్లాసులు మొదలయ్యాయి. పకడ్బందీ మార్గదర్శకాల నడుమ పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించారు. కొవిడ్ నేపథ్యంలో క్లాస్ రూములో శానిటైజర్లను టీచర్లు అందుబాటులో ఉంచారు. క్లాస్ లోకి వచ్చాక మాస్క్ కచ్చితంగా ఉండేలా సూచనలు చేశారు. క్లాస్ రూమ్ కి కేవలం 16మంది మాత్రమే ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రయివేట్ స్కూళ్లలో విద్యార్థులు పెద్దగా క్లాస్ కి హాజరుకాని దృశ్యాలు ఏపీలో కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో మాత్రం కాస్త మెరుగైన హాజరు ఉంది. స్కూళ్లలో మాస్క్ ధరిస్తామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తామని, శాని టైజర్ వినియోగిస్తామని పిల్లల చేత ఉదయం ప్రతిజ్ఞ చేయించారు ఉపాధ్యాయులు. విద్యార్థులకు స్క్రినింగ్ టెస్ట్ చేసి క్లాస్ రూం లోపలకు పంపుతున్నారు. క్లాస్ రూంలో మాస్కులు ధరించి భౌతిక దూరంగా విద్యార్థులు కూర్చున్న దృశ్యాలు అన్ని పాఠశాలల్లోనూ కనిపిస్తున్నాయి.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 180 రోజులపాటు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకున్న పనిదినాల్లో 144 రోజులు క్లాసుల్లోనే బోధిస్తారు. మిగిలిన ఆదివారాలు, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఇళ్ల వద్దే చదువుకుంటారు. స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికుల పిల్లలకు ఇబ్బంది కలగకుండా తక్షణ ప్రవేశాలు కల్పించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. పిల్లలు, పాఠశాల సిబ్బంది ఆరోగ్యం, పరిశుభ్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.