ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ… డేటా చోరీపై తీర్మానాలు

• ఏకగ్రీవంగా ఆమోదించిన జనసేన విస్తృత స్థాయి సమావేశం
ఓటర్ల జాబితాలో అక్రమాలను నివారించాలనీ, డేటా చౌర్యంపై కేంద్ర హోమ్ శాఖ విచారణ చేయాలనీ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం తీర్మానించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రవేశపెట్టారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు, సమావేశానికి హాజరైన పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలు….
1. రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఓట్ల నమోదు దశ నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇంటి నంబర్లు లేకుండానే వేల ఓట్లు నమోదు అయ్యాయి. నకిలీ ఇంటి నంబర్లతోనూ ఓట్లు రాశారు. ఒకే డోర్ నెంబర్ పై వందల ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలోనూ అవకతవకలు చోటు చేసుకొంటున్నాయి. తనిఖీ అధికారి వెంట వాలంటీర్లు తిరుగుతూ వైసీపీకి అనుకూలంగా ఉండరు అనుకొన్నవారిని తొలగించే విధంగా పనిలో ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం పకడ్బందీగా చేపట్టాలని తీర్మానిస్తున్నాం.
2. ఈ శతాబ్దంలో అత్యంత విలువైన ఆస్తి డేటా అని నిపుణులు చెబుతున్నారు. మన డేటాను మనకే తెలియకుండా ఆర్థిక అక్రమాలకీ, ఇతర అక్రమాలకు వినియోగించే నేర ప్రవృతి కలిగిన ముఠాలు పుట్టుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా చోరీ సాగుతోందనే అనుమానాలు బలంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ తిరుగుతూ – ఇంటి నంబర్ నుంచి ప్రతి ఒక్కరి సెల్ ఫోన్, ఆధార్, పాన్ వివరాలు, వేలి ముద్రలు, ఐరిస్, విద్యా వివరాలు, ఆదాయం, ఆదాయ మార్గాలు, కుటుంబ సభ్యుల డేటా తీసుకొంటున్నారు. మన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలు, సమాచారం హైదరాబాద్ కంపెనీలకు ఎవరు చేర్చారు? వాటి వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ చౌర్యంపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సమగ్ర విచారణ చేయించాలని తీర్మానిస్తున్నాం.