వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది

• వైసీపీ అరాచకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
• నాలుగేళ్లలో అన్ని వర్గాలకు అండగా నిలబడ్డాం
• కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాం
• ఈ నెల 10 నుంచి విశాఖలో మూడో విడత వారాహి యాత్ర
• క్షేత్రస్థాయి పర్యటనలో వైసీపీ అవినీతిని ఎండగడదాం
• మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నాదెండ్ల మనోహర్
• మనం యుద్ధం చేయబోతున్నది ఒక బ్రహ్మ రాక్షసుడితో: నాగబాబు

ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలను వైసీపీ నాశనం చేస్తోందని, వైసీపీ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీలు, విధానాలు, అన్యాయాలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేశారన్నారు. వారాహి విజయ యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు… ఇదే ఉత్సాహంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు. బటన్ నొక్కామని గొప్పగా చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి మోసాలు, మాయలు మనమే ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ “రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే వారు కనబడని పరిస్థితుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి అంశంలో ప్రజల పక్షాన నిలబడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇతర పార్టీలకు భిన్నంగా అవకాశవాద రాజకీయాలకు దూరంగా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తున్నారు.
• అజెండా ప్రకారంమే దుష్ప్రచారం
గత ఐదేళ్లుగా ఒక అజెండా ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి ఆలోచనలు చేయడం దుర్మార్గం. గత ఎన్నికల్లో ప్రజలు నిండు మనసుతో ఆలోచించి వైసీపీకి 151 సీట్లతో భారీ మెజారిటీ కట్టబెట్టిన సమయంలో బాధ్యతగల రాజకీయ పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామన్న సందేశాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చారు. జనసేన పార్టీ ఎన్నికల కోసం వచ్చిన పార్టీ కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ. నిరంతరం ప్రజలకు మెరుగైన పరిపాలన అందేలా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాం. అందులో భాగంగా విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం బలంగా నిలబడి ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. ప్రభుత్వంలో మార్పు వచ్చేలా అన్ని వేదికల మీద మాట్లాడాం. తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టాం. రైతుల పక్షాన నిలబడ్డాం. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించాం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాదిరి రైతుల కోసం నిలబడలేదు. కేవలం ఆర్ధిక సాయంతో సరిపెట్టకుండా వారి కుటుంబాల్లో చిన్నారుల చదువులు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏర్పాటు చేశారు.
• సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం
వారాహి విజయ యాత్ర రెండు విడతలు దిగ్విజయంగా పూర్తి చేశాం. మొదటి విడత తూర్పు, రెండో విడత పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజా సమస్యలు అనేకం మన దగ్గరకు వచ్చాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేశారు. మేధావులు, నిపుణులతో మాట్లాడిన అనంతరం సమస్య మూలాలు, వాటి పరిష్కారాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా బలంగా తీసుకెళ్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలలే సమయం ఉంది. పార్టీ అందుకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో బలమైన అడుగు వేసి ప్రజలకు అండగా నిలబడదాం. ఈ ప్రస్థానంలో అనేక ఇబ్బందులు ఉంటాయి. వీర మహిళలు చేసే అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకుంటూనే ఉంది. అయినా వారు వెనకడుగు వేయకుండా పోరాడారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి వాడుకుంటుంటే మనం మార్పు కోసం నిలబడుతున్నాం. మీరంతా ప్రతి అడుగు పార్టీ కోసం వేయండి. పార్టీలో ఏ ఒక్క కార్యకర్తకు నాయకుల వల్ల ఇబ్బంది అయ్యిందనే పరిస్థితి రాకూడదు. అంతా ఒకే జెండా కింద కలసికట్టుగా కార్యక్రమాలు చేయాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజన్ కోసం పొరపొచ్చాలు లేకుండా కలసి పని చేయండి.
• మూడో విడతలో వైసీపీ భూ దందాలపై పోరాటం
మూడో విడత వారాహి విజయ యాత్ర విశాఖలో మొదలు కాబోతోంది. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు జరిగే యాత్రలో బహిరంగ సభలతో పాటు క్షేత్ర స్థాయి పర్యటనలు ఉంటాయి. వైసీపీ నేతలు దౌర్జన్యంగా గుంజుకున్న ప్రజల ఆస్తులన్నింటినీ బయటకు తీసుకువద్దాం. విశాఖలో ఏ స్థాయి భూదందాలు జరిగాయో దేశం మొత్తం తెలిసేలా వారాహి యాత్ర నిర్వహిద్దాం. ఢిల్లీ పర్యటన ద్వారా ఎన్డీఏ మీటింగ్ కి ఆహ్వానించి ప్రధాని శ్రీ మోదీ గారు, శ్రీ నడ్డా గారు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా గౌరవించారో చూశాం. దేశానికి ఇటువంటి నాయకుడి అవసరం ఉందన్న నమ్మకం వారికి ఉంది. అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకువచ్చి గౌరవించారు. ప్రతి సమావేశంలో మన ప్రాంతం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, భవిష్యత్తు కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా మాట్లాడారు. ఏ అంశలోనూ రాజీ పడలేదు. కేంద్రంలోని పెద్దలు సైతం మీ అభిప్రాయాలు గౌరవిస్తామని చెప్పారు. పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితం కోసమే చేస్తుంది. అదే విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
• ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో
షణ్ముఖ వ్యూహాన్ని అంతా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. యువతకి పది లక్షల ఆర్ధిక సాయం అందచేస్తున్నామంటే దాని వెనుక ఉన్న అర్ధాన్ని తెలుసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా యువతకు వాళ్ల చేతుల్లో పని ఉండాలి.. తద్వారా పది మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళ్దాం. ఐదేళ్లలో ఒక్కో నియోజకవర్గం నుంచి 2500 మందిని వారంతట వారు వ్యాపారాలు చేసుకునే ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్ ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తాం. ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేస్తాం. ఉత్తరాంధ్ర నుంచి వలసలు అరికడతాం. ఆ ప్రాంతంలోనే ఉపాధి కల్పించే విధంగా ముందుకు తీసుకువెళ్తాం. మత్స్యకారుల కోసం పోర్టులు, జెట్టీలు, హార్బర్లు తీసుకువచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తాం. నిజాయతీగా ముందుకు వెళ్తున్నాం కాబట్టే ప్రజల్లో తలెత్తుకు తిరగగలుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం తెప్పించుకోండి. రాష్ట్రంలో అనేక చోట్ల ఓట్లు తొలగించారు. జనసైనికులు ఎక్కువగా ఉన్న చోట ఓట్లు తొలగిస్తున్నారు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఓటరు లిస్టు చెక్ చేసుకోండి. అందరికీ ఓట్లు ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించండి. ఓట్ ఫర్ జనసేన.. మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్లాలి. ఖచ్చితంగా మార్పు వస్తుందన్న నమ్మకంతో ముందుకు వెళ్లాలి. క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రతి గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యులున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. జనసేన పోటీ చేస్తే ఈ సీటు ఖచ్చితంగా గెలుస్తుందనే స్థాయికి వచ్చాం. ఓటరు లిస్టుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. మరో ఆరు నెలలు కష్టపడండి. రెండు నెలల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మంగళగిరికి మార్చేశారు. ఇక మీదట ఇక్కడే సమావేశాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం” అన్నారు.
• బ్రహ్మ రాక్షసుడిని గద్దె దించాలంటే కలసి పోరాటం చేయాలి : శ్రీ నాగబాబు
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీకి లేని యువశక్తి జనసేన పార్టీకి ఉంది. ఆ యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే అద్భుత మార్పును తీసుకురాగలుగుతాం. పార్టీ సీనియర్లు, యువత కలిసి కార్యక్రమాలు చేయాలి. రాజకీయాల్లో కొత్తతరాన్ని ప్రోత్సహించకపోతే పార్టీ నష్టపోతుంది. మనం యుద్ధం చేయబోతున్నది ఒక బ్రహ్మరాక్షసుడితో… మనలో మనం కొట్టుకొని పలుచన కాకూడదు. అందరం ఒక్క తాటిపైకి వచ్చి పోరాటం చేస్తే ఆ బ్రహ్మరాక్షసుడిని గద్దె దించడం కష్టమైన పని కాదు. నిస్వార్ధమైన నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనం కోసం, రాష్ట్రం కోసం పోటీ చేయకుండా నిస్వార్థంగా బీజేపీ, టీడీపీకి మద్దతు తెలిపారు. ఆయన వ్యక్తిత్వం నుంచి ఎంతో కొంత తీసుకొని పాటిస్తే మనుషులుగా మనం గొప్పగా ఎదుగుతాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మా అమ్మ దిగులు చెందుతుంటే ఒకటే చెప్పాను… కళారంగానికి అన్నయ్యను, సమాజానికి కళ్యాణ్ ను వదిలేయ్.. అక్కడ వాళ్లను కోట్లాది మంది ఆరాధిస్తున్నారు. నీలాంటి ఎందరో తల్లుల ఆశీర్వాద బలం వాళ్లకు ఉంది అని ఓదార్చాను. రాష్ట్రంలో జనసైనికులు, వీరమహిళలు ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారో… విదేశాల్లో కూడా అంతే ఎనర్జిటిక్ గా ఉన్నారు. యూకే, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్ లో ఈ మధ్య పర్యటించి పార్టీ మద్దతుదారులను కలిశాను. అందరూ చాలా మోటివేటింగ్ గా ఉన్నారు. వాళ్లందరికీ ఒకటే చెప్పాను. మీరు ఇండియా వచ్చి పార్టీ కోసం పనిచేయలేకపోతే సోషల్ మీడియా ద్వారా అయినా మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పండి. ఎలక్షన్ వారం, పది రోజుల ముందు వచ్చి ఒక్కొక్కరు పదిమందిని ప్రభావితం చేయండి చాలు మార్పు సాధ్యమవుతుందని చెప్పాను. కుటుంబం కోసం ఒక వ్యక్తి… గ్రామం కోసం కుటుంబం… రాజ్యం కోసం గ్రామం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని, ఇదే జనసేన సిద్ధాంతం. గతంలో ఒక వ్యక్తిని చూసి మరో వ్యక్తికి ఓటు వేశారు. తరువాత తండ్రిని చూసి కొడుక్కి ఓటేశారు. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి” అన్నారు.