జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో రెండు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు పేర్కొన్నారు. అతడు ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియలేదని చెప్పారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

మరో చోట జరిగిన ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టును భద్రతాబలగాలు హతమార్చాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతమయ్యాడు. అయితే టెర్రరిస్టుల కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.