ఢిల్లీ అసెంబ్లీ విచారణకు గైర్హాజరైన ఫేస్‌బుక్‌

దేశ రాజధానిలో జరిగిన అల్లర్ల ఘటనకు సంబంధించిన ఫేస్‌బుక్‌ అధికారులు ఢిల్లీ అసెంబ్లీ విచారణకు హాజరుకాలేదు. దీనిపై ఢిల్లీ అసెంబ్లీ కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ చాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ అధికారుల చర్య ఢిల్లీ అసెంబ్లీని అవమానించడం, కమిటీని ధిక్కరించడమేనని అన్నారు. ఫేస్‌బుక్‌ అధికారులకు ఇది తుది హెచ్చరిక అని, వారిపై కోర్టు చర్యలు తప్పవని మండిపడింది. కాగా, ద్వేషపూరిత పోస్ట్‌లపై ఉద్దేశపూర్వకంగానే ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకోవడం లేదంటూ ఢిల్లీ అసెంబ్లీ, శాంతి సామరస్య కమిటీ ఫేస్‌బుక్‌ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిత్‌ మోహన్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, ఈ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే మేము పార్లమెంట్‌ కమిటీ ముందు హాజరయ్యాం. మీరు పంపిన నోటీసులను వ్యతిరేకిస్తున్నాం. వాటిని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొంది. ఫేస్‌బుక్ స్పందనను కమిటీ తీవ్రంగా పరిగణించింది. సభ్యులు దాన్ని అవమానకరంగా, ధిక్కరణగా భావించారు. ‘ఇది దిల్లీకి సంబంధించిన విషయం. ఈ అంశం కమిటీ పరిధిలోనిది కాదని ఫేస్‌బుక్ ఎలా చెప్పగలదు. సంస్థ ప్రకటన ఆమోదయోగ్యం కాదు. పార్లమెంట్‌కు సంబంధం లేకుండా రాష్ట్ర అసెంబ్లీ స్వతంత్రంగా పనిచేస్తుంది. దిల్లీ అల్లర్ల ఘటనలో మీ పాత్రను బయటపడకుండా దాచేందుకే మీరు హాజరుకాలేదు’ అని కమిటీ మండిపడింది.