విమాన టికెట్ల చార్జీలు పూర్తి రిఫండ్

కోవిడ్-19  నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ తొలి రెండు దశల సమయంలో విమాన టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి తిరిగి పూర్తిగా చెల్లిస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. మార్చి 25 నుంచి మే 3 మధ్యన దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం టికెట్ల బుకింగ్ చేసుకున్న వారికి ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్‌ను డీజీసీఏ సమర్పించింది. కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. కాగా ప్రయాణాల కోసం ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకున్నవారు రిఫండ్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ తొలి రెండు దశలైన మార్చి 25 నుంచి మే 3 వరకు దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణాల కోసం బుకింగ్ చేసుకున్న టికెట్లకు సంబంధించిన చార్జీలను పూర్తిగా చెల్లిస్తామని సుప్రీంకోర్టుకు డీజీసీఏ తెలిపింది.