గోల్కొండ బోనాలు .. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: ఆశాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఆదివారం నుంచి వచ్చే నెల 8 వరకు హైదరాబాద్‌లో బోనాలు జరగనున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. బగ్గీపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. గోల్కొండ ఉత్సవాలతో ప్రారంభంకానున్న బోనాల సందడి నెలకొన్నది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఆదివారం జరగనున్న గోల్కొండ బోనాల పండుగ సందర్భంగా భక్తులు భారీగా అమ్మవారి దర్శనానికి తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. మక్కాయి దర్వాజ మీదుగా రామ్‌దేవ్‌గూడ – గోల్కొండ కోట, ఫతే దర్వాజ మీదుగా లంగర్‌హౌజ్‌ -గోల్కొండ్‌ కోట, బంజారా దర్వాజ మీదుగా సెవెన్‌ టూంబ్స్‌ – గోల్కొండ్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, దారి మళ్లింపులను విధించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.