గోల్డెన్ బర్గర్‌: రుచి అమోఘం.. ఖరీదు ఘనం

ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఆర్డర్లు చేసుకొని మరీ లాగించేస్తుంటారు. ఈ ఫాస్ట్‌ఫుడ్‌లో వెరైటీలు కనిపిస్తే వెంటనే ఆర్డర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ వంటి వాటికి ఎప్పుడూ గిరాకీ అధికంగానే ఉంటుంది. బర్గర్‌లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఈ గోల్డెన్ బర్గర్. పేరుకు తగినట్టుగానే దీన్ని బంగారంతో తయారు చేశారు. ఈ బర్గర్ తయారీలో ఖరీదైన కేవియన్‌, పెద్ద సముద్రపు పీత, కుంకుమపువ్వు, వాగ్యూ బీఫ్‌, పందిమాంసం, ఆరుదైన తెల్లని పుట్టగొడుగులు, చీజ్‌, ఖరీదైన సీవెట్ కాఫీ గింజలతో తయారుచేసిన బార్బెక్యూ సాస్‌, డామ్ పెరెగ్నాన్ షాంపెన్‌తో తయారు చేసిన బన్‌ను ఉపయోగించి బర్గర్ తయారు చేశారు.

దీనిపై బంగారు ఆకులతో అలంకరిస్తారు. ఖరీదైన వస్తువులతో తయారు చేశారు కాబట్టి ఈ బర్గర్ ఖరీదుకూడా అదే రేంజ్‌లో అక్షరాల 4.42 లక్షలు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ బర్గర్‌ను నెదర్లాండ్‌లోని డే డాల్టన్ రెస్టారెంట్ తయారు చేసింది. ఈ గోల్డెన్ బర్గర్‌కు గోల్డెన్ బాయ్‌గా పేరు పెట్టారు. ఈ బర్గర్‌ను అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ కు అందిస్తామని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.