మూడు రాజధానులపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం
- సమగ్రంగా త్వరలోనే మళ్లీ తెస్తామని సిఎం ప్రకటన
మూడు రాజధానులకు సంబంధించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నప్పటికీ మళ్లీ పూర్తి, సమగ్రమైన మెరుగైన బిల్లును తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. ‘విస్తృత, విశాఖ ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన అన్నారు. అంతకుముందు సోమవారం ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభలోనూ, హైకోర్టులోనూ నాటకీయ పరిస్థితులు నెకొన్నాయి, ఉదయం హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై విచారణ జరుగుతుండగా అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఉద్దేశించిన పాలనా వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు చట్టాలను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు రద్దు బిల్లులను ఈ రోజే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేస్తారని చెప్పారు. దీంతో న్యాయమూర్తులు విచారణను మధ్యాహ్నానికిy వాయిదా వేశారు. మధ్యాహాం2.15 గంటలకు తిరిగి విచారణ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఉపసంహరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశం పెడుతోంది. ఇదే విషయాన్ని ఎజి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో బిల్లులను, వాటికి సంబంధించిన వివరాలను శుక్రవారం కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. విచారణను 29వ తేదికి వాయిదా వేశారు. అంతకుముందు విచారణ ప్రారంభంలో ఎజి వెల్లడించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అసెంబ్లీలోనూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రులు, అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టడం కనిపించింది. అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.. మద్యాహ్నాం రెండుగంటల ప్రాంతంలో ప్రారంభమైన శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రద్దు చట్టం 2020, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం 2020’ రద్దు బిల్లులను శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఆయన మూడు రాజధానులకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనలోనూ అదే విషయాన్ని నొక్కి చెప్పారు.
శ్రీబాగ్ ఒప్పందంతో మొదలు
ముఖ్యమంత్రి ప్రకటన శ్రాబాగ్ ఒప్పందంతో మొదలైంది. శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో తమ ప్రభుత్వం గతంలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టామని వివరించారు. ఈ బిల్లును ఆమోదించిన వెంటనే ప్రక్రియ ప్రారంభించి ఉంటే ఉంటే అభివృద్ధి ఫలాలు ఇప్పటికే అందేవని అన్నారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణగా ఆ ప్రక్రియను ప్రారంభించలేకపోయామన్నారు. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు వ్యతిరేకించారని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పుద్వారా స్పష్టమైందని అన్నారు. హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దేవద్దని అన్నారని పేర్కొన్నారు. అందువల్లే వికేంద్రీకరణను బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామని వివరించారు. దీనిపై కొద్దిమంది అపోహలు, అనేక అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు చేశారని తెలిపారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని పక్కనబెట్టి కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను ముందుకు తెచ్చారని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రతిపాదించిన విశాఖపట్నంలో ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్నాయని, సుందరీకరణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తే రాజధాని నగరానికి అవసరమైన అన్ని వసతులూ ఉన్నాయని వివరించారు. అదే అమరావతి అభివృద్ధికి లక్షకోట్లు ఖర్చవుతాయని అన్నారు. ఇంత పెద్దమొత్తం తెచ్చిపెట్టడం అంత తేలికయ్యేపనికాదని అన్నారు. అదే సమయంలో ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుతో కనీసం రోడ్లేసుకోవడానికి, డ్రైనేజీ వేసుకోవడానికి కరెంటు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఇక్కడ రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.తనకు ఈ ప్రాంతం మీద వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని చెప్పారు. అంతకుముందు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ మాట్లాడుతూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ మేలని సూచించిందని, అ ప్రతిపాదనను కనీసం అసెంబ్లీలో చర్చకు కూడా పెట్టలేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలోనే అన్ని సంస్థలు ఏర్పాటు ద్వారా మహానగరంగా మారినందున విభజన వాదం ముందుకొచ్చిందని కమిటీ తెలిపిందన్నారు.