రిజర్వేషన్‌ కోసం మరోసారి గుజ్జర్ల ఆందోళన

రాజస్థాన్‌లోని గుజ్జర్లు రిజర్వేషన్‌ కోసం మరోసారి ఆందోళన బాటపట్టారు. ఆదివారం భరత్‌పూర్‌లో రైలు పట్టాల వద్ద నిరసన తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో తమ వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని గుజ్జర్లు డిమాండ్‌ చేస్తున్నారు. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర వర్గాలకు ఇచ్చిన ప్రత్యేక రిజర్వేషన్‌ను నిరాకరించింది. ఈ నేపథ్యంలో గుజ్లర్లు మరోసారి ఆందోళనకు దిగారు.

రాజస్థాన్‌ ప్రభుత్వ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ 14 అంశాలపై శనివారం గుజ్జర్ల నేతలతో చర్చలు జరిపింది. హిమ్మత్ సింగ్ గుజ్జర్ నేతృత్వంలోని ఒక వర్గం దీనికి ఆమోదం తెలుపగా విజయ్ బెయిన్‌స్లా వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ఆదివారం ఆందోళనకు దిగింది. వీరి ఆందోళన కారణంగా వివిధ రైళ్ల షెడ్యూలును అధికారులు మార్చవలసి వచ్చింది. అవధ్ ఎక్స్ ప్రెస్, ఢిల్లీ-ముంబై-రాజధాని ఎక్స్ ప్రెస్ వంటి రైళ్ల షెడ్యూలును మార్చినట్టు అధికారులు తెలిపారు. 2007 నుంచే గుజ్జర్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సీఎం అశోక్ గెహ్లాట్ తో తమ డిమాండ్ల విషయమై మాట్లాడామని, కానీ ప్రయోజనం లేకపోయిందని గుజర్ల నేత విజయ్ బైన్ స్లా చెప్పారు. ‘మా యువతకు ఉద్యోగాలు లేవు. వారిలో ఆగ్రహం పెరుగుతున్నది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ జీతో మాట్లాడినా ఎలాంటి ఫలితం లేదు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం’ అని చెప్పారు.