అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

అన్నయ్య శ్రీ చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya ..! అని జనసేనాని పేర్కొన్నారు.