యువ శక్తిని సమాయత్తం చేయండి

* పార్టీ నేతలకు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం
నిరాశ, నిస్పృహ ఆవహించిన ఉత్తరాంధ్ర యువతలో భరోసా నింపడానికే జనసేన పార్టీ యువ శక్తి కార్యక్రమం నిర్వహిస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే యువతకు ఎక్కడా ఏ లోటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. గురువారం సాయంత్రం విశాఖలో యువ శక్తి కార్యక్రమ నిర్వహణ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, ప్రచారకర్తలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వంపై, శ్రీ జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో నమ్మకం పోయింది. రాజకీయ స్వలాభం కోసం ఈ ప్రాంత యువతలో ఉన్న శక్తి, నైపుణ్యాన్ని నిర్వీర్యం చేశారు. యువ శక్తిలో మీ గళం వినిపించండి అని మనం చెప్పగానే ఒక్క రోజులోనే 3741 ఫోన్ కాల్స్, దాదాపు 1400 ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం యువత ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో ప్రచారకర్తలు ప్రతి మండలంలో యువశక్తి కార్యక్రమం గురించి ప్రచారం చేయడంతో పాటు ఉత్తరాంధ్ర ముఖ్య సమస్యలు, పాలకుల భూ కబ్జాలు, వలసల నిరోదానికి భవిష్యత్తులో జనసేన పార్టీ తీసుకోబోతున్న చర్యలపై ప్రచారం చేయాలని సూచించారు.
* యువశక్తి సభకు విరాళాలు
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగే యువశక్తి సభకు తమవంతు మద్దతుగా పలువురు పార్టీ నేతలు విరాళాలు అందించారు. తాడేపల్లిగూడెం పార్టీ ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ రూ. 2 లక్షలు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి అందజేశారు. పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ తన వంతుగా రూ.50 వేలు ప్రకటించారు.