ఉత్తరాంధ్ర యువ నాయకత్వాన్ని కావాలనే చంపేశారు

* ఉత్తరాంధ్ర అంటే రెండు కుటుంబాల ఆస్తి కాదు
* వనరులు, సహజ సంపదలను దోపిడీ చేశారు
* విశాఖ సమ్మిట్ పేరుతో మరోసారి మోసానికి కుట్ర
* ఈ ముఖ్యమంత్రిని చూసి పెట్టుబడిదారులు ఎలా వస్తారు?
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన వ్యతిరేకం
* పీడితుల తరపున నిజాయతీగా పోరాడుతాం
* యువ శక్తి ద్వారా భవిష్యత్తు ఆలోచనలు తెలియజేస్తాం
* యువశక్తి సన్నద్ధత కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ఉత్తరాంధ్ర రెండు కుటుంబాల సొత్తు కాదు.. ఒకే కుటుంబం నుంచి ఏకంగా 6 మంది ఎమ్మెల్యేలు ఉండే వ్యవస్థ కాదు… ఇక్కడి యువ నాయకత్వాన్ని కొన్ని కుటుంబాలు, వ్యక్తులు తొక్కిపట్టి పెత్తనం చెలాయించారు. సహజ సంపద దోపిడీ చేసి, కావాలనే యువ నాయకత్వాన్ని చంపేశారు. ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవస్థలో యువ నాయకత్వం అవసరం. సమస్యలపై పోరాడే గుణం, ధైర్యంగా గళమెత్తే నైజం.. ప్రతి సమస్య మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్న యువ నాయకులకు ఇక్కడ కొదవ లేదు. అలాంటి నాయకత్వం వెలికి తీయడమే జనసేన పార్టీ లక్ష్యం, ఇదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జరిగే యువశక్తి కార్యక్రమంలో ఉత్తరాంధ్ర యువత సన్నద్ధం, పరిచయ కార్యక్రమం శుక్రవారం భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న యువత తమ మనోభావాలను, విజయ గాధలను, ప్రభుత్వ తీరును వివరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ” ఈ ప్రాంతంలో యువనాయకత్వానికి బాధ్యతలు ఎలా అప్పగించాలి..? చైతన్యం కలిగిన యువతకు ఈ ప్రాంత నాయకత్వ పగ్గాలు ఎలా ఇవ్వాలనేదాని పైనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఎలా నిలబడాలి అనేది ఇప్పుడు చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడింది యువతరమే. కేవలం సమస్యలపై నిలబడటమే కాదు పోరాడి వాటికి ఓ పరిష్కార మార్గం చూపడమే జనసేన పార్టీ ధ్యేయం. దానికి యువతను తగిన విధంగా సన్నద్ధం చేస్తాం.
* మరోసారి విశాఖలో ఇండస్ట్రియల్ సమ్మిట్ పేరిట మోసం
యువకుడు, ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి ఐటీ శాఖ మంత్రి అవుతున్నారంటే అందరం సంబరపడ్డాం. అయితే ఆయన ఐటీ పనులు తప్ప మిగతా అన్ని పనులు చూస్తూ అబాసు పాలవుతున్నారు. విశాఖలోని మధురవాడ మిలీనియం టవర్స్ ఏ బ్లాక్ లో రెండు లక్షల చదరపు అడుగుల ఖాళీ ఉంటే, కేవలం 1 లక్ష చదరపు అడుగులు మాత్రమే ఇప్పటి వరకు వినియోగించగలిగారు. అలాగే మిలీనియం టవర్స్ బి బ్లాక్ లో 1.53 లక్షల చదరపు అడుగుల ఖాళీ ప్రదేశం అలాగే ఉండిపోయింది. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత దిగజారిపోయింది. కింద నుంచి రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఐటీ ఉత్పత్తుల్లో వివిధ రాష్ట్రాలు దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం కేవలం 0.1 శాతం వాటా కలిగి ఉంది. కేవలం రూ.1290 కోట్ల ఐటీ ఉత్పత్తులను మాత్రమే మనం ఎగుమతులు చేయగలిగాం. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం ఐటీ ఉత్పత్తులో దూసుకు వెళ్తోంది. రూ.1.83 లక్షల కోట్ల ఐటీ ఉత్పత్తులను తెలంగాణ ఇస్తే, ఏకంగా రెండు లక్షల ఉద్యోగాలను కల్పించింది. ఇప్పుడు మరోసారి విశాఖలో ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టే పేరుతో మోసం చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి ఎలాన్ మస్క్, సత్య నాదెళ్ల, జెఫ్ బెజోస్ లాంటి మహామహులకు ఆహ్వానాలు పంపుతూ అక్కడితో చేతులు దులుపుకునే పని ఇప్పటికే మొదలు పెట్టింది. పెట్టుబడిదారులు రెండు విషయాలను పరిశీలిస్తారు. పెట్టుబడి పెట్టే ప్రాంతంలో ఉన్న పరిపాలన పరిస్థితులు, శాంతిభద్రతలు తెలుసుకున్న తర్వాతే వారు పెట్టుబడి పెడతారు. రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి మొహం, ఐటీ మంత్రి మొహం చూసి పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు..? ఉత్తరాంధ్ర యువత కేవలం ఉపాధి కోసం చదువులు కోసమే కాదు కోచింగ్ సెంటర్ల కోసం కూడా వలసలు వెళ్లడం బాధాకరం. హైదరాబాదులోని అమీర్ పేటలో ఉత్తరాంధ్ర యువకులు కోకోల్లలుగా కనిపిస్తున్నారని ఇటీవల ఓ యువకుడు నా దగ్గర చెప్పడం బాధనిపించింది.
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన వ్యతిరేకం
ఉత్తరాంధ్రకు మణిహారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకం. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మొదట ప్రకటన బయటికి వచ్చినప్పుడు మొట్టమొదట స్పందించింది జనసేన పార్టీ మాత్రమే. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాలతో కూడుకున్న ఒక గొప్ప పరిశ్రమ. ఉత్తరాంధ్ర యువతకు ఓ కలల ఉపాధి మార్గం. 32 మంది ప్రాణ త్యాగాలు, ఎందరో రైతుల భూమి త్యాగాలతో కూడుకున్నది. కేంద్రంలోని బీజేపీ పెద్దలను గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నా సరే ఈ ప్రాంతం ప్రజలకు కష్టం వస్తే కచ్చితంగా జనసేన పార్టీ పోరాడడంలో ముందుంటుంది. మీడియా ముందు ఒకటి, లోపల మరొకటి మాట్లాడే వ్యక్తులం కాదు. నిబద్ధతతో రాజకీయాలు చేస్తాం. దీనిపై ఇప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచనను ప్రజలకు వివరించారు.
* ఎన్నాళ్ళు ఈ వలసలు?
దేశ రక్షణ కోసం తపించే యువ శక్తి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉంది. మత్స్యకారులతో పాటు అన్ని రంగాల్లోనూ ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. మత్స్యకారులకు ఒక జెట్టీ గాని ఫిషింగ్ హార్బర్ గాని ఏ ప్రభుత్వం నిర్మించలేకపోయింది. ఉపాధి కోసం గుజరాత్ వంటి రాష్ట్రాలకు మత్స్యకారులు వలసలు వెళ్లిపోతున్నారు. 50 మంది కలిసి ఒకే రూమ్లో, ఒకే బాత్రూం వాడుకుంటూ వెతలు అనుభవిస్తూ బతుకుతున్నారు. నిజాయతీతో పాటు కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉత్తరాంధ్ర బలం. వారికి కనీస ఉపాధి సహాయం చేయకుండా ఇప్పుడు మూడు రాజధానులు అంటూ అధికార పార్టీ ఆడుతున్న నాటకం ఇక్కడి యువత గుర్తించాలి. వర్క్ ఫ్రం హోం తర్వాత యువత ఆలోచనలో గణనీయమైన మార్పు వచ్చింది. మన గ్రామాలు ఎందుకు ఇలా ఉన్నాయి..? ఈ సమస్యలకు మూలం ఏంటి అనే విషయాలను ఆలోచించడం మొదలుపెట్టారు. సొంత గ్రామాల్లో ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు వారికి అవగతమయ్యాయి. వారిలో కొత్త ఆలోచనలు, పోరాడే తత్వం పెరిగింది.
* అంతా అణిచివేత విధానం
సచివాలయాలకు ఏకంగా రూ.160 కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం రంగులు వేయించింది. అదే డబ్బులు వైద్య సౌకర్యాల కోసం ఖర్చు పెడితే ఎంతోమందికి మేలు చేకూరేది. ఈ ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడం మాత్రమే తెలుసు. ఈ ప్రభుత్వం పెద్దలకు వారాహి వాహనం కలర్ ఎలా ఉండాలి.. ఎంత ఎత్తు అన్న విషయాలు మీద చర్చ తప్ప ఇంకేం ఉండదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని అణిచివేత ధోరణితో అడ్డుకున్నారు. విశాఖలో జనవాణి నిర్వహించేందుకు వస్తున్నప్పుడు పోలీసుల హడావిడి చూసి ఆశ్చర్యం అనిపించింది. కార్యక్రమం అడ్డుకున్న తర్వాత తెలిసిన విషయాలు ఏమిటంటే ఉత్తరాంధ్రలో జరిగిన భూదోపిడి, వనరులు కొల్లగొట్టడంపై బాధితులు పూర్తి సాక్షాధారాలతో, నివేదికలతో జనవాణి కార్యక్రమానికి వస్తున్నారని ప్రభుత్వం తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంది.
* యువత కోసమే జనసేన ఆలోచనలు
యువశక్తితోనే దేశ ఆర్థిక పరిపుష్టి అనేది నిజం. యువత ఎంత బలంగా ఎదుగుతారో దేశం కూడా అంతే వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. 65 శాతం యువత కలిగిన అత్యంత బలమైన శక్తి భారతదేశం. యువత మేలు కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నిత్యం కొత్తగా ఉంటాయి. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం రూ. లక్షల రూపాయల సాయం అందేలా చేసేందుకు జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం ప్రణాళిక ఉంది. యువత మరో పదిమందికి ఉపాధి కల్పించి వారి సత్తాను నిరూపించుకోవాలి. జనసేన పార్టీ బలం యువశక్తి. ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది యువత తాము కష్టపడిన రూపాయి నుంచి ఒక పది పైసలు పార్టీ కోసం వెచ్చించే వారు ఉన్నారు. నిజాయతీతో మార్పును ఆహ్వానించేవారు ఉన్నారు. జనవరి 12వ తేదీన జరగబోయే యువశక్తి కార్యక్రమంలో పార్టీ ప్రణాళికలు, భవిష్యత్తు విధానాలు, అభివృద్ధికి చేసే మంత్రాంగం ఏమిటి..? దీనికోసం ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం అన్న పూర్తి విషయాలను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ఈ ప్రాంతపు యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం వంటి అన్ని అంశాలను ఒకసారి గుర్తుకు వచ్చేలా కార్యక్రమం ఉంటుంది. యువత ఎప్పుడూ ఓటు బ్యాంకు కాదు… బలమైన ఉత్తేజపు కెరటాలు అనేలా భావించి జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి” అని అన్నారు. భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు శ్రీ అక్కల గాంధీ, శ్రీ బేతపూడి విజయ్ శేఖర్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.
* అలరించి.. ఆలోచింపచేసిన “నో నేమ్” బ్యాండ్
ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన నో నేమ్ బ్యాండ్ సభ్యులు పాడిన పాటలు అందరిని అలరించాయి… ఆలోచింపచేసాయి. చీపులిక్కర్ మీద పాడిన పాట తో పాటు.. ఓటు హక్కు మీద బృంద సభ్యులు పాడిన పాటలు అందరిలో స్ఫూర్తి నింపాయి. లయబద్ధంగా సాగిన పాటలకు యువత వంత పాడారు.