మూసీకి భారీ వరద.. హైదరాబాద్ బ్రేక్‌డౌన్‌

ఎగువ ఉన్న హిమాయాత్ సాగర్ గేట్లు తెరవడంతో.. మూసీ నది పొంగి ప్రవహిస్తున్నది. వలిగొండ మండల పరిధిలో స్థానిక త్రిశక్తి ఆలయం సమీపంలో మూసీ వంతెన వద్ద పార్కింగ్ చేసిన 12 లారీలు వరద ప్రవాహానికి నీటమునిగాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తడంతో మండల కేంద్రం నుంచి పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. చాదార్ ఘాట్ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మూసానగర్, శంకర్ నగర్, కమల్ నగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్ళల్లోకి నీరు చేరటంతో ప్రజలు పైకప్పుకు చేరారు. చాదర్‌ఘాట్ కొత్త వంతెనపైకి నీరు చేరింది. దీంతో కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌కు రాకపోకలు పూర్తిగా స్థంభించాయి.

రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో .. వరద నీటితో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గంలో ఉన్న మూసారామ్ బాగ్ బిడ్జ్ వద్ద వరద నీరు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఆ రూటును పోలీసులు మూసివేశారు. ట్రాఫిక్ పోలీసు అడిషనల్ కమిషనర్ ఐపీఎల్ అనిల్ కుమార్ దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. మూసారాం బాగ్ రూట్లో వెళ్లే ప్రయాణికులు మరో మార్గంలో వెళ్లాలని సూచించారు.

ఇక నాంపల్లి వద్ద భారీ వృక్షం నేలకూలింది. రాత్రి గాలివాన బీభత్సానికి ఆ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఆ చెట్టును తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో చాపెల్ రోడ్డు వైపు వెళ్లే ప్రయాణికులను దారి మళ్లించారు. బషీర్‌భాగ్‌లోని ఆయాకార్ భవన్ వద్ద కూడా ఓ భారీ వృక్షం పడిపోయింది. ఆ రూట్లో వెళ్లే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఫలక్‌నుమా ఆర్‌యూబీ వద్ద భారీ వరద నీరు ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహం తగ్గేంత వరకు ప్రయాణికులు మరో మార్గంలో వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కొన్ని చోట్ల వాహనాలు బ్రేక్‌డౌన్ కావడంతో.. వాటిని ప్రత్యేక వాహనాల్లో ట్రాఫిక్ పోలీసులు తరలిస్తున్నారు.