భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో వరద పరిస్థితి, తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. సీఎస్‌, హైదరాబాద్, మేడ్చల్‌, రంగారెడ్డి కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కేటీఆర్ సూచించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను కమ్యూనిటీ హాళ్లకు తరలించాలన్నారు.

బస్తీ దవాఖానాల్లోని డాక్టర్లు, ఇతర సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. కరెంట్ పునరుద్ధరణకు విద్యుత్‌ సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మూసీ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఓపెన్‌ నాలాల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాతావరణశాఖతో సమన్వయం చేసుకుంటూ… జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ముందుకెళ్లాలని కేటీఆర్‌ సూచించారు.