కేరళలో నదుల ఉగ్రరూపం.. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన

దాదాపు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లోని నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో పలు డ్యామ్‌ల వద్ద గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా డ్యాముల దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో సహాయక శిబిరాల సంఖ్యను 240కి పెంచారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సిఎం విజయన్‌ పేర్కొన్నారు. సూచించారు. పెరియార్‌ నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఇడుక్కి రిజర్వాయర్‌ గేట్లు తెరచి నీటికి కిందికి విడుదల చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఇడుక్కి రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యంలో 93 శాతానికి పైగా నీరు ఉండడంతో అధికారులు గేట్లు తెరిచారు. ఈ రిజర్వాయర్‌ నుంచి నీటికి కిందకి విడుదల చేయడం గత మూడేళ్లలో ఇది రెండోసారి కావడం గమనార్హం. త్రిసూర్‌ జిల్లాలోని ఛలకుడి నదీ పరివాహక ప్రాంతంలోని షోలయార్‌, పెరింగల్‌కుతు, పరంబికుళం డ్యామ్‌లను తెరిచే ముందుగా ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 11 జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌

బుధవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కొచ్చిలోని సబర్బన్‌ ప్రాంతాలతో సహా ఇడుక్కి డ్యామ్‌ దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించింది. 20వ తేదీన తిరువనంతపురం, పతనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్‌, పాలక్కడ్‌, మలప్పురం, కోజికోడ్‌, వాయనాడ్‌, కన్నూర్‌ జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌, అదేవిధంగా కాసరఘడ్‌, అలప్పుజ, కొల్లాం జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. 21న కన్నూర్‌, కాసరఘడ్‌ తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. మరోవైపు కొట్టాయం జిల్లాలోని కూట్టికల్‌, ఇడుక్కి జిల్లాలోని కొక్కయార్‌ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో శిథిలాల కింద చిక్కుకున్న మరికొంత మంది మృతదేహాలను ఎన్‌డిఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది వెలికితీశారు.