చెన్నైలో భారీ వర్షాలు

తమిళనాడు రాజధాని చెన్నైను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2015 తరువాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. నగరంలోని నుంగంబక్కమ్‌ ప్రాంతంలో శని, ఆదివారాల్లో దాదాపు 215 మీమీ వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు. 2015 నవంబర్‌ 16న నమోదైన 246.5 మీమీ వర్షపాతం తరువాత ఇదే అత్యధికమని వెల్లడించారు.
వర్ష బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదివారం పరిశీలించారు. చెన్నైలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువల్పూరు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు వర్ష బాధిత ప్రజల కోసం 140 శిబిరాలను ప్రారంభించనున్నారు. ఇందులో 44 శిబిరాలను ఇప్పటికే ప్రారంభించారు. చెంగల్పట్టు, కాంచీపురం, మధురై జిల్లాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించనున్నారు.