మహారాష్ట్రలో 8 నెలల పసికందుకు హెచ్‌ఐవి రక్తం: దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం

మహారాష్ట్రలో ఘోరం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 8 నెలల చిన్నారి జీవితం చీకటిమయమైంది. ఆ పసికందుకు హెచ్‌ఐవి రక్తం ఎక్కించడంతో ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం దర్యాప్తుకు ఆదేశించింది. దీనిపై మూడు రోజుల్లోగా నివేదికను అందించాలని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే ఆదేశించారు. విచారణకు ఆదేశించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అజాగ్రత్త కారణంగా చిన్నారి జీవితాన్ని ప్రమాదంలో పడేసినవారు తప్పించుకోలేరంటూ జల్నాలో మాట్లాడారు.

తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నారికి రెండు నెలల క్రితం తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో వైద్యుడి సూచన మేరకు అకోలాలోని ఓ రక్త నిధి నుంచి రక్తాన్ని ఎక్కించారు. రక్త మార్పిడి చేశాక చిన్నారి కోలుకున్నా.. తిరిగి అనారోగ్యం బారిన పడుతూనే ఉంది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత నెలలో అమరావతిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పాపకు వేరే అనారోగ్య లక్షణాలు కనిపించకపోవడంతో అనుమానించిన వైద్యులు హెచ్‌ఐవి పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది. ఆ పాప తల్లిదండ్రులకూ హెచ్‌ఐవి పరీక్ష చేయగా నెగటివ్‌ వచ్చింది. దీంతో వైద్యులు వారిని ఆరా తీయగా రక్తం ఎక్కించిన విషయాన్ని వెల్లడించారు. ప్రతి రక్తనిధిలోనూ దాతల నుంచి రక్తాన్ని స్వీకరించే ముందు హెచ్‌ఐవి సహా అన్నిరకాల పరీక్షలు చేయాలని నిబంధనలు ఉన్నాయని, అయినా పాపకు రక్తనిధి నుంచి హెచ్‌ఐవీ రక్తం ఎలా ఎక్కించారన్నది తెలియాల్సి ఉందని వైద్యవర్గాలు తెలిపాయి.