చిన్న పిల్లలకు ఎక్కువ హెమ్ వర్క్ ఇస్తే ఎలా?.. ప్రధానికి ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి

జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ ఆరేళ్ల బాలిక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముద్దులొలుకుతున్న ఆ చిన్నారి.. ఇంత చిన్న వయసులో హోమ్ వర్క్ పేరుతో తమపై పెద్ద భారం మోపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసింది. చిన్నారి వీడియోపై స్పందించిన జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్.. స్కూల్ పిల్లలపై హెమ్ వర్క్ భారం తగ్గించేలా 48 గంటల్లోగా ఒక పాలసీని రూపొందించాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

నమ్రతా వఖ్లూ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసిన ఆ చిన్నారి వీడియోకి ఇప్పటివరకూ 3.69 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో చిన్నారి మాట్లాడుతూ… ‘మోదీ సాబ్.. నేనో ఆరేళ్ల బాలికను మాట్లాడుతున్నాను. చిన్న పిల్లలకు టీచర్లు ఎందుకంత హోమ్ వర్క్ ఇస్తారు. 6,7 తరగతుల విద్యార్థులకు ఆ హెమ్ వర్క్ ఇవ్వాలి. నేను ప్రతీరోజూ 10 గంటల నుంచి 2 గంటల వరకు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నాను. మ్యాథ్స్,ఇంగ్లీష్,ఉర్దూ,ఎన్విరాన్‌మెంట్ స్టడీస్,కంప్యూటర్ క్లాసులు చెబుతున్నారు.కానీ ఇంత చిన్న పిల్లలకు ఎక్కువ హెమ్ వర్క్ ఇస్తే ఎలా..?’ అంటూ ఆ చిన్నారి ప్రశ్నించింది.

ఆ చిన్నారి వీడియోపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందిస్తూ.. ‘ఇది చాలా దృష్టిసారించాల్సిన ఫిర్యాదు. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలిచ్చాను. స్కూల్ పిల్లల హోమ్ వర్క్‌కి సంబంధించి 48 గంటల్లోగా ఒక పాలసీని రూపొందించాలని చెప్పాను. బాల్యం అనేది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ లాంటిది. బాల్యమంతా సంతోషంతో సజీవంగా ఉండాలి.’ అని పేర్కొన్నారు.

ఆ చిన్నారి వీడియోకు చాలామంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘వాట్ ఏ క్యూటీ.. మోదీ గారు ఆ చిన్నారి కష్టాలు వింటున్నారా.. దయచేసి ఈ ఆన్‌లైన్ క్లాసుల టార్చర్ నుంచి చిన్నారులను కాపాడండి.’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరో నెటిజన్ ‘సరైన ప్రశ్న.. చిన్నపిల్లలు రోజూ ఐదారు గంటలు సెల్‌ఫోన్ వాడితే కళ్లపై దాని దుష్ప్రభావం పడుతుంది. ఇంత చిన్న వయసులో ఎక్కువసేపు ఫోన్‌తో గడపాల్సి రావడం మంచిది కాదేమో.. ‘అని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఆ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో చాలామంది హృదయాలను దోచేస్తోంది.