మీ ఆధార్, పాన్‌ లింక్ కాలేదా..లేదంటే పాన్ కార్డ్ రద్దవుతుంది

మీ ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ అయిందా లేదా..ఒకవేళ కాకపోతే వెంటనే లింక్ చేసుకోండి. చివరి తేదీ దగ్గర పడుతోంది. ఒకవేళ చేయకపోతే పాన్‌కార్డు రద్దై పోతుంది. అంతేకాదు రెండింట్లో వివరాలు సరిగ్గా ఉండాలి కూడా..

పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ చేయడం ఓ తప్పనిసరి ప్రక్రియ. ఈ రెండింటినీ లింకప్ చేసేందుకు చివరి తేదీ మార్చ్ 31, 2021. మరోసారి పొడిగింపు ఉండదని ఆదాయపు పన్నుశాఖ స్పష్టం చేసింది. గడువు తేదీలోగా ఆధార్ కార్డును పాన్‌కార్డుతో అనుసంధానం చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్‌కార్డు రద్దవుతుంది. అలాగని ఇదేదో కష్టమైన ప్రక్రియ అనుకోవద్దు. చాలా సులభం. ఇంటి నుంచే ఆ పని చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్‌కార్డులో అందించిన సమాచారం ఒకదానికొకటి సరిపోకపోతే అదో సమస్యగా మారుతుంది. ముఖ్యంగా పేరు, పుట్టిన తేదీ, వంటి ముఖ్యమైన సమాచారం పాన్‌కార్డు, ఆధార్ కార్డుల్లో వేర్వేరుగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇవి సరి చూసుకోవల్సిన అవసరముంది. ఆ సమాచారం సరిగ్గా లేకపోతే అభ్యర్ధన రిజెక్ట్ అవుతుంది.

ఒకవేళ సమాచారం సరిపోకపోతే..పాన్ ఆధార్ లింకింగ్ ప్రక్రియకు సంబంధించిన అభ్యర్ధన రిజెక్ట్ అయితే బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను ఎంచుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న ఎన్ఎస్‌డిఎల్ పోర్టల్ నుంచి ఆధార్ సీడింగ్ రిక్వెస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత సమీపంలోని పాన్‌కార్డు సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ ప్రక్రియను ఆఫ్‌లైన్ ద్వారా పూర్తి చేయాలి. లేదా మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్‌లలో ఇచ్చిన మిగిలిన వివరాల్ని నింపాలి, కావల్సిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ చేసేందుకు 2021 మార్చ్ 31 గడువు తేదీగా ఉంది. ఆ లోగా రెండింటినీ అనుసంధానం చేయకపోతే మీ పాన్‌కార్డు రద్దవుతుంది. అంతేకాదు రద్దైన పాన్‌కార్డు కోసం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్నుశాఖ చట్టంలోని సెక్షన్ 272 బి ప్రకారం పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశాలున్నాయి.