తొలగించిన మంత్రులకు కీలక బాధ్యతలు.. బీజేపీలో భారీ మార్పులు!

మంత్రివర్గ విస్తరణలో భాగంగా పదవులు కోల్పోయిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటువైపు దృష్టి సారించిన బీజేపీ.. పదవులు వదులుకున్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, ప్రకాశ్ జవదేకర్, సదానందగౌడ, రమేశ్ ఫోఖ్రియాల్ వంటి నేతలను కీలక పదవుల్లో నియమించాలని నిర్ణయించింది.

సదానంద గౌడను సొంత రాష్ట్రమైన కర్ణాటకకు, హర్షవర్ధన్‌ను ఢిల్లీకి పంపనున్నట్టు తెలుస్తోంది. అలాగే, స్వతంత్ర హోదాలో పనిచేసిన యూపీ నేత సంతోష్ గంగ్వార్‌కు గవర్నర్ పదవి దక్కనున్నట్టు చెబుతున్నారు. థావర్ చంద్ గెహ్లాట్ స్థానంలో ఖాళీగా ఉన్న రాజ్యసభా పక్షనేత పదవి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, లేదంటే ధర్మేంద్ర ప్రధాన్‌లలో ఒకరికి లభించే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్‌లకు అప్పగించనున్నారు. మరోవైపు, బీజేపీ, ఆరెస్సెస్ సమన్వయ బాధ్యతలను  సంయుక్త ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌కు అప్పగించాలని ఆరెస్సెస్ నిర్ణయించింది.