5-11 ఏళ్ల చిన్నారుల ఫైజర్‌ టీకాకు అమెరికా ఆమోదం

5 నుండి 11 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు అందించేందుకు అభివృద్ధి చేసిన ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోదం తెలిపింది. దీంతో ఈ వయస్సు కల్గిన 28 మిలియన్ల మంది చిన్నారులు లబ్ది పొందనున్నారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల దుష్ప్రభావాల కన్నా ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని అత్యున్నత స్థాయి మెడికల్‌ ప్యానల్‌ పరిశీలించి.. ప్రభుత్వానికి సూచించింది. అనంతరం ఈ ఆమోదం వచ్చింది. చిన్నారులకు వ్యాక్సిన్లు అందిస్తున్న చైనా, చిలీ, క్యూబా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సరసన అమెరికా చేరింది. ఈ టీకా ఆమోదం కోసం తల్లిదండ్రులు, సంరక్షకులు, పాఠశాల సిబ్బంది ఎంతగా ఎదురుచూస్తున్నారో ఓ తల్లిగా, వైద్యురాలిగా తనకు తెలుసునని ఫుడ్‌, డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాత్కాలిక చీఫ్‌ జనెట్‌ వుడ్‌ కుక్‌ అన్నారు. చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా సాధారణ పరిస్థితులు తిరిగి రానున్నాయని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సిడిసి)..క్లినికల్‌ సిఫార్సులను మరింత పరిశీలించేందుకు ప్యానల్‌ను సమావేశపరచిన తర్వాత టీకా వినియోగం ప్రారంభమవుతుంది.