సిద్ధాంతాలు ఒక్కటైతే పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం: కమల్‌హాసన్‌

రజనీకాంత్‌ పార్టీతో పొత్తు విషయంపై విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాదానంగా ‘మక్కల్‌ నీది మయ్యం’ అధ్యక్షుడు కమల్‌హాసన్‌.. ఒక్క ఫోన్‌కాల్‌ చాలు ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని అన్నారు.  అయితే సిద్ధాంతాలు ఒకేవిధంగా ఉండాలని అన్నారు. అదే విధంగా ఆ సిద్ధాంతాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని, అలా ఉంటే భేషజాలకు పోకుండా పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం కమల్‌హాసన్‌ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల రజనీకాంత్‌ కూడా పార్టీ విషయంపై స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో పార్టీని పెట్టబోతున్నానని, ఇందుకు సంబంధించిన వివరాలను డిసెంబర్‌ 31న వెల్లడిస్తానని ప్రకటించారు. మరోవైపు ఆయన పార్టీ పేరు మక్కల్‌ సేవై కచ్చి గా ఎన్నికల సంఘంలో నమోదు చేయించినట్లుగా, ఆటో గుర్తును కేటాయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రజనీకాంత్‌ స్పందించలేదు.