రాజకీయ లబ్ది కోసమే మహాత్మునిపై అనుచిత వ్యాఖ్యలు

గుంటూరు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతుందని, రాజకీయ లబ్ది కోసమే మహాత్మాగాంధీని కించపరిచేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు అన్నారు. మహాత్మాగాంధీపై ఎస్సి కమీషనర్ విక్టరీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో హిమని సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ కోట్లాదిమంది భారతీయులు ఆరాధ్యదైవమైన మహాత్మునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ విక్టరీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో జయించి భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు అందించిన మహాత్మునిపై విక్టరీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించి విక్టరీ ప్రసాద్ ని వెంటనే పదవి నుంచి రాజీనామా చేయించాలని నెరేళ్ల సురేష్ డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, నగర నాయకులు కొండూరు కిషోర్, యడ్ల నాగమల్లేశ్వరరావు, చింతా రాజు, కవిత, భాషా, సుంకే శ్రీను, పలువురు డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు పాల్గొన్నారు.