పాక్‌ ప్రధాని విమానానికి భారత్ అనుమతి..!

న్యూఢిల్లీ : భారత గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతించాలన్న పాకిస్తాన్‌ అభ్యర్థనను భారత్‌ అంగీకరించింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఫిబ్రవరి 23వ తేదీ నుండి చేపట్టనున్న శ్రీలంక పర్యటన కోసం భారత గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ప్రోటోకాల్‌ ప్రకారం.. దేశాధినేతల వివిఐపి విమనాలు ఇతర దేశాల గగనతలంపై నుండి వెళ్లేటపుడు ముందుగా ఆదేశం నుండి అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. అయితే గతంలో భారత విమానాలు తమ దేశ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అమెరికా, సౌదీ అరేబియాకు పాక్‌ మీదుగా వెళ్లేందుకు పాక్ ప్రధాని అనుమతించలేదు. అలాగే 2019లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ యూరప్‌ పర్యటన సమయంలోనూ పాక్‌ అనుమతించలేదు. దీంతో పాక్‌ వ్యవహారంపై భారత్‌ అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకు ఫిర్యాదు కూడా చేసింది.