భారత్‌ పాక్ పై సర్జికల్‌ స్ట్రైక్‌కు ప్లాన్‌ చేస్తోంది.. ఖురేషి ఆరోపణలు

భారతదేశంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం ఖురేషి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ భూభాగంపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోందన్నారు. అబుధాబీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ”తమ విఫల విధానాల నుంచి, అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాలని భారత్‌ ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి మా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ విషయంలో తన భాగస్వాముల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. పాక్‌లో ఉగ్రవాదానికి భారత్‌ మద్దతు ఇస్తోంది. ఈ విషయం గురించి యూఏఈతో కూడా చర్చించాం. భారత్‌ ఏం చేసినా అడ్డుకోవడానికి, తిప్పికొట్టడానికి పాక్‌ సర్వ సన్నద్ధంగా ఉంది” అని ఖురేషీ పేర్కొన్నారు. అయితే దాడుల కోసం భారత్‌కు అనుమతి ఇవ్వాల్సిన ఆ భాగస్వాములెవరన్నదానిపై ఆయన స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. కాగా, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు పాక్ భయపడుతోందంటూ ఇండియన్ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.