గ‌త ఏడాది భార‌త్ మాకు చేసిన సాయం మరువ‌లేనిది: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ

అమెరికాలో క‌రోనా విజృంభ‌ణ అధికంగా ఉన్న స‌మ‌యంలో భార‌త్ ప‌లు ఔష‌ధాల‌ను పంపి సాయం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని అమెరికా త‌రుచూ గుర్తు చేసుకుంటోంది. భార‌త విదేశాంగ శాఖ జైశంక‌ర్ ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. 

ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బ్లింకెన్ మాట్లాడుతూ.. త‌మ దేశంలో గ‌త ఏడాది క‌రోనా విప‌రీతంగా వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో భార‌త్ సాయం చేసింద‌ని, ఆ సాయాన్ని తాము ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని తెలిపారు. ఇప్పుడు భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో తాము అండ‌గా ఉన్నామ‌ని చెప్పారు.

కాగా, ఈ సంద‌ర్భంగా జై శంక‌ర్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ…ఇరు దేశాల మ‌ధ్య అనేక అంశాల్లో చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సి ఉంద‌ని చెప్పారు. భార‌త్-అమెరికా  బంధం మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్లు భావిస్తున్నాన‌ని తెలిపారు. ఈ బంధం ఇలాగే కొన‌సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. క‌రోనా వేళ అమెరికా ఇచ్చిన మ‌ద్ద‌తు, అందించిన సాయానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్న‌ట్లు వివరించారు.