తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

మాట్లాడే భాష… రాసే భాష ఒకటి కావాలని తపించి ఆ దిశగా వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారిని తెలుగు జాతి ఎన్నడూ మరువకూడదు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకువచ్చి మన మాతృభాషకు జీవంపోశారు. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు. కాబట్టి ప్రజలే తెలుగు భాషను కాపాడుకొనే బాధ్యతను స్వీకరించాలి. తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పని తీరును గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యా శాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షర దోషాలు ఉంటున్నాయో చూస్తేనే తెలుస్తోంది. అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేము. వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలి. చిన్నారులు ఓనమాలు నేర్చుకొనే దశ నుంచే మన మాతృ భాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి.