జగన్ రెడ్డి గారూ.. ముందుగా మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పచ్చబొట్లు వేయించండి

•ముఖ్యమంత్రి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది
•మా మొబైళ్ల మీద మీ స్టిక్కర్లు ఏంటి?
•మీ ప్రచారార్భాటాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా?
•సంక్షేమాన్ని గాలికి వదిలి స్కిక్టర్లు అంటించుకుంటూ తిరుగుతున్నారు
•ముందుగా అర్హులందరికీ సకాలంలో ఫించన్లు ఇవ్వండి
•జనసేన పార్టీ కార్యకర్తలకు భద్రత-భరోసా కల్పించేందుకే క్రియాశీలక సభ్యత్వం
•తెనాలిలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్

ప్రచార ఆర్భాటాలకు పోయి వైసీపీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని, ముఖ్యమంత్రి తన ప్రచారం కోసం ఇంటింటికీ స్టిక్కర్లు అంటించాలి… మన మొబైళ్ల మీద ఆయన ఫోటోలు వేయాలని అంటూ ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి ముందుగా తన మంత్రులు, ఎమ్మెల్యేలకు పచ్చబొట్లు వేయించి ప్రజల్లోకి పంపాలని ఎద్దేవా చేశారు. ఆయనకు వారి మీద నమ్మకం లేదు కాబట్టి మేము వైసీపీ వాళ్లం.. జగనన్నకు తోడుగా ఉంటాం.. ఆయనంటే మాకు భరోసా అన్న మాటలు చెప్పిస్తే బాగుంటుందన్నారు. మంగళవారం తెనాలి పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన శిబిరాల వద్ద పలువురికి క్రియాశీలక సభ్యత్వాలు ఇచ్చారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ.. క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ “ప్రజాస్వామ్యంలో బాధ్యతగల ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అది వదిలేసి ఇంటింటికీ స్టిక్కర్లు అంటించుకుంటూ తిరుగుతామంటే ఎలా?
•రోజుకి రూ.700 కోట్లు ఖర్చు
ఎక్కడ చూసినా ప్రజలు మాకు ఏడాది గడచినా ఫించన్లు రావడం లేదు అని చెబుతున్నారు. కరెంటు బిల్లులు చూపి వృద్ధులకు, వితంతువులకు ఫించన్లు ఆపేస్తున్నారు. కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితమవుతూ ప్రజల్ని మోసం చేస్తూ, ఇంటింటికీ వెళ్లి భయపెడుతూ పాలన సాగిస్తున్నారు. మొన్నటి వరకు వాలంటీర్లు. ఇప్పుడు 5 లక్షల మంది గూఢచారుల్ని నియమించామని చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారు. రోజుకి రూ. 700 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన ఘనత శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వానిది. భవిష్యత్తు గురించి ఆలోచించి అమరావతి రాజధాని నిర్మించాలి. పెట్టుబడులు తీసుకురావాలి. మౌలిక వసతుల కల్పన మీద దృష్టి సారించాలి.
•విజయవంతంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియ
జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా కార్యకర్తలకు భద్రత – భరోసా కల్పించాలన్న ఆలోచనతోనే చేపడుతుంది. జనసేన క్రియాశీలక సభ్యత్వం వర్ధమాన భారత దేశ రాజకీయాల్లో ఇంత వరకు ఎవరూ చేపట్టని కార్యక్రమం. కార్యకర్తలు ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడం కోసం మూడు సంవత్సరాల క్రితం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా క్రియాశీలక సభ్యుల్ని తీర్చిదిద్దుతాం” అన్నారు.
•క్రియాశీలక సభ్యుడికి రూ. 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కు
తెనాలి పట్టణ పరిధిలోని 6వ వార్డుకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు తూము మురళీ ఇటీవల జరిగిన ప్రమాదంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. తెనాలి పట్టణ పర్యటన సందర్భంగా మురళీకి పార్టీ తరఫున రూ. 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కును నాదెండ్ల మనోహర్ అందచేశారు. తెనాలికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎడ్ల బ్రహ్మాజీ గారి తండ్రి శ్రీ రాజారావు ఇటీవల కాలం చేశారు. పర్యటనలో భాగంగా నాదెండ్ల మనోహర్ డాక్టర్ బ్రహ్మాజీని పరామర్శించారు.
•బ్రహ్మరథం పట్టిన తెనాలివాసులు
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు తెనాలి పట్టణంలో పర్యటించిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి పార్టీ శ్రేణులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. వీధి వీధినా మహిళలు హారతులు పట్టారు. భవనాల మీద నుంచి పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. 3, 4, 5 వార్డుల్లో ప్రజలు శ్రీ మనోహర్ గారిని కలసి సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ నాయకులు ఇస్మాయిల్ బేగ్, పసుపులేటి మురళీకృష్ణ, తోటకూర వెంకటరమణారావు, షేక్ జాకిర్ హుస్సేన్, గుంటూరు కృష్ణమోహన్, ఎర్రు వెంకయ్యనాయుడు, దివ్వెల మధుబాబు, వల్లెం మురళీ, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.