ఆపద్బాంధవుడు, అనిర్వచనీయ సేవాతత్పరుడు జై చిరంజీవుడు

  • నిరుపేదకు నిత్యావసర సరుకుల పంపిణి
  • జనసేన ఇంచార్జి డా యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, చిరంజీవికి జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నానని నియోజకవర్గం ఇంచార్జి డా యుగంధర్ పొన్న తెలిపారు. మండల కేంద్రంలోని ఒక నిరుపేద కుటుంబానికి చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. చిరంజీవి జీవితం తెరిచిన పుస్తకం అని, ఆయన ఇంతవాడు అంతవాడైన విషయం చెప్పాలా, ఆయన సాధించిన విజయాలు గురించి చెప్పాలా, ఆయన సినిమాల్లో సాధించిన రికార్డుల గురించి చెప్పాలా, ఆయన అధిరోహించిన పదవుల గురించి చెప్పాలా, ఆయన కీర్తిప్రతిష్టల గురించి చెప్పాలా, ఆయన సేవాతత్పరత గురించి చెప్పాలా, ఇవన్నీ తెలుగు వారందరితోపాటు యావత్ భారత దేశమంతటికి సర్వ విదితమే అని కొనియాడారు. దోసిట సంపాదిస్తే గుప్పెడు దానం చేయాలనే ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే అని, చెమటను ధారగా పోసి సంపాదించిన సొమ్ము నుంచి ఎందరికో సహాయం చేశారని ప్రశంసించారు. పేదరికంతో బాధపడుతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా లేదా చదువులకు దూరమైన వారి గురించి ఎవరి ద్వారా తెలిసినా తక్షణం స్పందించి సాయం చేసే సహృదయ మానవతావాది చిరంజీవి. కోవిడ్ సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో అలమటించకుండా ఆయన చూపిన దాతృత్వం, బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందితో ఏర్పరచుకున్న రక్త సంబంధం, వేలాది గుప్త దానాలు, ఇలా ఒకటి రెండు కాదు, ఇటీవల ప్రకటించిన ఉచిత ఆసుపత్రి స్థాపన వరకూ చేస్తున్న కార్యక్రమాలు ఆయనలోని మానవతామూర్తిని తెలియచేస్తాయని ఆయన సేవలను స్తుతించారు. అన్నిటికన్నా మిన్న ఆయనలోని ఒదిగి ఉండే లక్షణం, తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి గారి సొంతం అని కొనియాడారు. వయసు తారతమ్యాలు, వర్గ వైరుధ్యాలు, కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకొనే విశాల హృదయుడు, ఆపన్న హస్తం చిరంజీవి. అటువంటి సుగుణాలున్న చిరంజీవికి అభిమానులు కావడం మా పూర్వ జన్మ సుకృతం ఫలం అని తెలిపారు. ఈ శుభదినం సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్ళు చిరాయువుగా వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, లోకేష్, సాయి, మండల బూత్ కన్వినర్ అన్నామలై, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్యదర్శి నవీన్, జనసైనికులు పాల్గొన్నారు.