కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా స్వీకరించిన ఏకైక పార్టీ జనసేన

• ఆపద సమయంలో ఆండగా నిలిచేందుకే క్రియాశీలక సభ్యత్వం
• జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
• కాకినాడలో క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున చెక్కులు ప్రదానం

కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా స్వీకరించిన ఏకైక పార్టీ జనసేన మాత్రమేనని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆపద సమయంలో కార్యకర్తలను ఆదుకునేందుకు వీలుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకువచ్చారని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తూ.. జనసేన పార్టీ ఒక భరోసా నింపుతోందన్నారు. ప్రభుత్వాల్లో ఉండి సంపాదించుకున్న పార్టీలు కూడా కార్యకర్తలను ఈ స్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అంతా రుణపడి ఉంటామన్నారు. కాకినాడలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు శ్రీ మనోహర్ గారు రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందచేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం, గొర్రిపూడి గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడు శ్రీ అరివిల్లి సుబ్బరాజు రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తాటిచెట్టు కూలి మృతి చెందారు. ఆయన భార్య శ్రీమతి మంగను పరామర్శించిన శ్రీ మనోహర్ గారు పార్టీ తరఫున ఆర్ధిక సాయం అందచేశారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, ధవళేశ్వరానికి చెందిన మరో క్రియాశీలక సభ్యుడు బద్దిరెడ్డి ముత్యాలరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్య శ్రీమతి సుజాతకు రూ. 5 లక్షల చెక్కును అందచేశారు. ఆ కుటుంబాలకు ఎలాంటి అవసరం వచ్చినా జిల్లా పార్టీ నాయకత్వం అందుబాటులో ఉంటుందని, పార్టీ భవిష్యత్తులోనూ అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా మనోహర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.