కోలాహలంగా జనసేన యువశక్తి సభ

* స్థానిక ఎన్నికల పోరాట యోధులతో కలిసి ప్రారంభించిన నాగబాబు
* కిక్కిరిసిన సభా ప్రాంగణం నుంచి యువత కేరింతలు
* అలరించిన ఉత్తరాది సాంస్కృతిక వైభవం

జనసేన యువశక్తి సభ ఆశలు ఆకాంక్షల మధ్య ఘనంగా ప్రారంభమైంది. భవిష్యత్తు బంగారంగా మారాలంటే యువతను బలోపేతం చేయడమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తున్న యువశక్తి సభకు చైతన్య కెరటాల్లా యువత తరలి వచ్చింది. రాష్ట్రంలోని నలువైపుల నుంచి వచ్చిన యువతతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. యువతీ యువకులంతా ఉదయమే సభా వేదిక వద్దకు చేరుకొని సందడి చేశారు. వివేకానందుడి జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని కొనియాడుతూ వినమ్ర అంజలి ఘటించారు. అనంతరం పీఏసీ సభ్యులు శ్రీ నాగబాబు గారు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి యువశక్తి సభను ఎరుపు, తెలుపు రంగులు కలిగిన 

బెలూన్లు ఎగరవేసి ప్రారంభించారు. జనసేన పార్టీకి తామెప్పుడూ అండగా ఉంటాం అంటూ వారు నినాదాలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్ర కళ అయిన తప్పెటగుళ్ళు కళాకారులు వివేకానంద వికాస వేదికపై తమ నృత్య ప్రదర్శన చేశారు. లయబద్ధంగా ఆడుతూ, మెడలో ఉన్న డప్పులను కొడుతూ జనసేన జెండాను ఎగుర వేయడం అబ్బురపరిచింది. అనంతరం డప్పు కళాకారులు ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ ఉత్తరాంధ్ర యాసతో పాడిన పాటలు అలరించాయి. తర్వాత యువశక్తి వేదిక నుంచి 100 మంది యువతీ యువకులు రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు, యువతకు అందని ప్రోత్సాహం, అస్తవ్యస్తంగా మారిన పాలన, పాలకుల దుర్నీతి తదితర అంశాల మీద మాట్లాడారు.