రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో తక్షణమే గైనకాలజిస్టు పోస్టును భర్తీ చేయాలని జన‌సేన డిమాండ్

రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గైనకాలజిస్ట్ లేక గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నందున తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజోలు జనసేన మండల అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ నిరసన

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గ పరిధిలోని ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి అయిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు సిబ్బంది కొరతతో గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తక్షణమే వైద్యులు కొరత లేకుండా పరిష్కరించాలని జన‌సేన నాయకులు డిమాండ్ చేశారు. కొద్దిరోజుల క్రితం చికిత్సకు వచ్చిన గర్భిణీ స్త్రీలకు సోమవారం డెలివరీ డేట్ ఇవ్వగా సుమారు ఏడుగురు గర్భిణీలు వచ్చారని, ఇక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో వారందరినీ వేరే వేరే ప్రాంతాలకు పంపించి వేశారని దుయ్యబట్టారు. ఇలా ఆకస్మికంగా డాక్టర్ లేకపోవడం వల్ల ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు కొరత లేకుండా తక్షణమే శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపాలని కోరారు. ఆసుపత్రి కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు దృష్టి సారించాలని కోరారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ జి ప్రభాకర్ ని వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్న గైనకాలజిస్ట్ ని డిప్టేషన్ పై వేరే ప్రాంతానికి పంపాల్సి వచ్చిందని వారంలో మరలా ఆమె తిరిగి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, గుండాబత్తుల తాతాజీ, ఎంపీటీసీ దార్ల లక్ష్మీ కుమారి చినబాబు, ఉలిశెట్టి అన్నపూర్ణ, పినిశెట్టి బుజ్జి, కోళ్ళ బాబి, పంచదార చినబాబు, చింతా ప్రసాద్, కాట్న రాజు, గండ్రోతు కిరణ్, జి. బాచి, బొక్కా చందు భాజాపా నాయకులు
గొల్లమందల నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.