వైసీపీకి ఓటేయటం మహాపాపం

  • వైకాపాకు మరోసారి అధికారం ఇస్తే ఆ పాపానికి ప్రాయచ్ఛితం కూడా లేదు
  • రాష్ట్రంలో అంతంతమాత్రంగా రాష్టాభివృద్ది, ప్రజా సంక్షేమం
  • రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంతంతమాత్రమే పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దాష్టీకాలతో ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీకి రానున్న ఎన్నికల్లో గెలుపు అంతంతమాత్రమేనని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ లకు, గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసిన వారికి భూ కబ్జాదారులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటమే కాకుండా వాళ్ళు సచ్చీలురని, ఆర్ధికంగా కూడా అంతంతమాత్రమే అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చెప్పటం అత్యంత హేయమని ఆయన విమర్శించారు. ఈ నేపధ్యంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు అంతంతమాత్రమే, రాష్ట్రంలో మహిళల భద్రత అంతంతమాత్రమే, దళితుల, ముస్లింల ధన, మాన, ప్రాణాలకు రక్షణ అంతంతమాత్రమే అంటూ ముద్రించిన పోస్టర్లను 22 వ డివిజన్లోని శ్రీనివాసరావుతోటలో మంగళవారం జనసేన శ్రేణులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ దాదాపుగా కోట్లకు పడగలెత్తిన వారేనన్నారు. ఎర్రచందనం , గంజాయి స్మగ్లర్ల భుజాలపై చేతులు వేసి వీళ్ళు మంచివాళ్ళు , సౌమ్యులు అంటూ ముఖ్యమంత్రే ప్రజలకు పరిచయం చేయటం సిగ్గుచేటన్నారు. పైగా వైకాపా అభ్యర్థుల ఆర్ధిక స్థితిగతులు కూడా అంతంతమాత్రమే అంటూ చేతులూపుతూ చెప్పడం జగన్ రెడ్డికే చెల్లిందన్నారు. పచ్చి అబద్దాలను వాస్తవాలుగా భ్రమింపచేయటంలో జగన్ రెడ్డి పీహెచ్డీ చేసారని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉంది మహిళల రక్షణ, నిరుద్యోగుల భవిష్యత్, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం అన్నారు. జగన్ రెడ్డి దుష్ట పాలనలో దళితుల, బీసీల, ముస్లిం మైనారిటీల బ్రతుకులు అగమ్యగోచరంగా మారాయని దుయ్యబట్టారు. ఐదేళ్లుగా ప్రజలకు నరకాన్ని చూపించిన వైసీపీకి ఓటేయటం మహాపాపం చేయటంతో సమానమన్నారు. ఇంత అరాచక పాలన చూశాక కూడా వైకాపా కు ఓటేస్తే ఆ పాపానికి ప్రాయచ్ఛితం కూడా ఉండదని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వంలో కుప్పకూలిన వ్యవస్థల్ని పునరుద్ధరించాలి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఉమ్మడి ప్రభుత్వం రావాలన్నారు. రాష్ట్రాన్ని, ముందుతరాల వారి భవిష్యత్ ను కాపాడుకోవాలి అంటే రాష్ట్రం నుంచి వైసీపిని తరిమేయాలని ఆళ్ళ హరి ప్రజల్ని కోరారు. జనసేన డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, నగర టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీమ్, పూసల శ్రీనివాస్, నండూరి స్వామి, కోటంశెట్టి బాలు, ఉదయ్ చంద్ర, సురేంద్ర, రమేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.