ఇన్ స్టా గ్రామ్ ని షేక్ చేస్తున్న జనసేనాని

• ఎంట్రీ ఇచ్చిన గంటల్లో మిలియన్ ఫాలోవర్స్
• ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే రికార్డు సృష్టించిన శ్రీ పవన్ కళ్యాణ్

కంటెంట్ ఉన్న వాడి కటౌట్ చాలు అన్న డైలాగ్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ని చూసే సినీ రచయితలు రాశారనడంలో ఎలాంటి సందేహం లేదు. పొలిటికల్ ఎంట్రీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను షేక్ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ ప్రతి అడుగు సంచలనంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమ వేదిక ఇన్ స్టా గ్రామ్ ఎంట్రీ కూడా అదే స్థాయిలో ఇచ్చారు. సరికొత్త చరిత్రకు తెరతీశారు. 2014లో రాజకీయ అరంగేట్రం తర్వాత ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన జనసేనాని, 2012 నుంచే ఫేస్ బుక్ ఖాతాని నిర్వహిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమ వేదికను ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించింది లేదు. నిరంతరం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటానికి తన ఖాతాలను వేదికగా మలచుకున్నారు. గత పదేళ్ల కాలంలో శ్రీ పవన్ కళ్యాణ్ పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నో సమస్యలపై ట్విట్టర్ వేదికగా ఎలుగెత్తారు. జనసేనాని ట్విట్టర్ వేదికగా యుద్ధం ప్రకటిస్తే పాలకులు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు కరువయ్యేది. అందుకే ట్విట్టర్ లో దేశంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ప్రముఖుల్లో ఒకరిగా శ్రీ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ట్విటర్ ఖాతాలో ఆయన్ను 5.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అక్షరాలా 53 లక్షల పైచిలుకు ఫాలోవర్స్ అన్నమాట. ఇక ఫేస్ బుక్ అకౌంట్ ఫాలోవర్స్ కూడా మిలియన్ కి చేరువగా ఉన్నారు. జనసేన పార్టీ పేరు మీద నిర్వహిస్తున్న ఫేస్ బుక్ ఖాతాకు 1.7 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతా రెండు మిలియన్ల సంఖ్య ఎప్పుడో దాటేసింది.

తాజాగా శ్రీ పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు మరింత చేరువయ్యే క్రమంలో మరో సామాజిక మాధ్యమ వేదిక ఇన్ స్టా లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మంగళవారం ఉదయం శ్రీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వగా.. వెంటనే అకౌంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది.  జనసేనాని ఇన్ స్టా ఎంట్రీ సామాజిక మాధ్యామాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎంట్రీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే శ్రీ పవన్ కళ్యాణ్ మిలియన్ ఫాలోవర్స్ దాటేశారు. గంటకో లక్ష చొప్పున ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోతున్నారు. ఇన్ స్టా గ్రామ్ ఖాతాలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో మిలియన్ ఫాలోవర్స్ సాధించిన వారిలో ప్రపంచంలోనే శ్రీ పవన్ కళ్యాణ్ 9వ స్థానంలో నిలిచారు. భారత దేశంలో రెండో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు. ప్రముఖ తమిళ నటుడు జోసెఫ్ విజయ్ మాత్రమే శ్రీ పవన్ కళ్యాణ్ కంటే ముందున్నారు.

అయితే శ్రీ పవన్ కళ్యాణ్ కంటే ముందుగా మిలియన్ ఫాలోవర్లను సాధించిన ప్రముఖులకు శ్రీ పవన్ కళ్యాణ్ కి ఒక తేడా ఉంది. అదే శ్రీ పవన్ కళ్యాణ్ ని సామాజిక మాధ్యమ శిఖరాగ్రాన ఎవరికీ అందనంత ఎత్తున నిలిపింది. అతి తక్కువ సమయంలో మిలియన్ ఫాలోవర్స్ సాధించిన మిగతా ప్రముఖులంతా ఇన్ స్టా ఎంట్రీతో పాటు పొస్ట్ కూడా చేసి ఈ ఘనత సాధించారు. శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఒక్క పోస్ట్ చేయకుండా కేవలం తన కటౌట్ తో ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించారు.

ఎలుగెత్తు.. ఎదిరించు.. ఎన్నుకో.. జైహింద్ అనే ఒకే ఒక్క కోట్ తో ఇన్ స్టా ఎంట్రీ ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన ఫాలోవర్స్ సంఖ్య 1.2 మిలియన్స్ దాటి దూసుకుపోతున్నారు. ఈ ప్రకంపనలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్ధులకు ప్రమాద సంకేతాలు పంపాయని జనసేన మద్దతుదారులు సంబరపడుతున్నారు.