ఆలయాల అభివృద్ధికి కేసీఆర్‌ కృషి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని బీఎన్‌రెడ్డినగర్‌లో భక్తాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మేయర్‌, ఎమ్మెల్యే, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి, ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి హాజరై.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం నిధులు కేటాయించారని గుర్తు చేశారు. చర్లపల్లి డివిజన్‌ పరిధిలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా ఆలయాలకు వచ్చే భక్తులకు మంచినీరు సౌకర్యం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయాలకు వెళ్లే రోడ్డు మార్గాల నిర్మాణ పనులను చేపట్టామని ఆయన గుర్తు చేశారు. అనంతరం గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే బేతిని, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి, ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డిలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు యాదాద్రి ప్రధాన అర్చకులు కారంపూడి నర్సింహా చార్యులు, వేణుగోపాల్‌చార్యులు ఆధ్వర్యంలో మంత్ర జపాలు, హోమం, హనుమాన్‌ చాలీసా పారాయణం, పూర్ణహుతి, ఆరగింపు, మంగళహారతి, పూజలు నిర్వహించారు.