టీడీపీ అధినేత చంద్రబాబు, సోనూసూద్ మధ్య కీలక సంభాషణ..

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తనకు సాయం కోసం ఫోన్ కాల్స్ వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సినీనటుడు సోనూసూద్ చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో ఆయన వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఇందులో సోనూసూద్ పాల్గొన్నారు. తనకు అర్థరాత్రి సమయంలో కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. వీలైనంత సాయం చేస్తున్నానని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సేవ చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. తన భార్య ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన మహిళ కావడం సంతోషమని సోనూసూద్ వ్యాఖ్యానించారు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు వంటివని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడి పాత్రను ప్రత్యక్షంగా చూశానని సోనూసూద్ తెలిపారు. అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. ఆ నగర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర గొప్పదని చెప్పారు. సోనూసూద్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. కరోనా విపత్తులో సోనూసూద్ అపార సేవలందించారన్నారు. ఎన్నో విపత్తులను చూశానని.. కరోనా వంటి సంక్షోభం చూడటం ఇదే తొలిసారి అన్నారు. ప్రకృతి విపత్తు సమయాల్లో ఎన్టీఆర్ ట్రస్టు, టీడీపీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సేవ చేయడానికి ప్రభుత్వానికి ఎన్నో అధికారాలు, అవకాశాలు ఉంటాయని.. మూడో దశ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలన్నారు.