నేడు ఎలక్షన్ కమిషన్ కీలక భేటీ..

కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మరి కాసేపట్లో భేటీ కానుంది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్ సునీల్ అరోరా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బలగాల మోహరింపు, ఏర్పాట్లపై చర్చించనున్నారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో బెంగాల్‌లో ఏడు నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

నాలుగు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళతో పాటు ఈ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సైతం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. రేపు బెంగాల్‌లో డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సుదీప్ జైన్ కూడా పర్యటించనున్నారు. బెంగాల్‌లో నిరంతరం తలెత్తుతున్న శాంతిభద్రతల పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నారు.