గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్ .. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పని చేయాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పట్నించి ఇప్పటి దాకా ఆరున్నరేళ్ళలో రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెప్పించామని, వాటితో ఏర్పాటైన సంస్థల్లో సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పించామని ప్రకటించారు రాష్ట్ర ఐటీ, మునిసిపల్ పరిపాలనా శాఖా మంత్రి కేటీఆర్. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ గురువారం నాడు పార్టీ ఇంఛార్జీలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల ప్రిపరేషన్‌పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

అక్టోబర్ 1వ తేదీ నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పంచాయతీ నుంచి శాసనసభ దాకా అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఫలాలు అందుతున్నాయని చెప్పారు.

ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు కేటీఆర్. ప్రైవేట్ రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అపూర్వమైన పాలన సంస్కరణలు చేపట్టామని, 60 ఏళ్ల ఫ్లోరైడ్ రక్కసిని ఆరు సంవత్సరాల్లో తరిమేశామని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని, కేవలం విపక్షాలే దివాళా తీశాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎజెండా దొరకని పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు.