మహేష్ కుటుంబానికి భరోసా ఇచ్చిన కేటీఆర్‌

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన జవాన్‌ మహేష్(26)కు కేటీఆర్‌ ఘన నివాళి అర్పించారు. మహేశ్‌ త్యాగం మరువలేనిదన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహేశ్‌ మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. వీరజవాను మహేష్‌ కుటుంబానికి తెలంగాణ అండగా ఉంటుందన్నారు. మహేష్ స్వగ్రామం స్వగ్రామంలో విషాదం అలముకుంది. నిజామాబాద్‌ జిల్లా సోమన్‌పల్లిలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై రోధిస్తున్నారు.

మరోవైపు  ఇదే ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మరో జవాన్‌ చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లికి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ స్వగ్రామంలోనూ విషాదం అలముకుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రవీణ్‌ త్యాగాన్ని అందరూ కొనియాడుతున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రవీణ్‌ గత 18 సంవత్సరాలుగా మద్రాస్‌ రెజిమెంట్‌లో సైనికుడిగా పని చేస్తున్నారు. హవల్దార్‌గా పని చేస్తూ కమాండో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ ఒక్కగానొక్క కొడుకు వీరమరణం పొందడంతో తమకు దిక్కులేకుండా పోయిందని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రవీణ్‌ తండ్రి విజ్ఞప్తి చేశారు.