ఆప్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ సింగ్

వచ్చే ఏడాది పంజాబ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. పంజాబ్‌పై పట్టుబిగించేందుకు సిద్ధమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అమృత్‌సర్‌లో పర్యటించిన కేజ్రీవాల్.. తాము అధికారంలోకి వస్తే సిక్కు వ్యక్తినే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామని చెప్పడం  ఇందులో భాగంగానే కనిపిస్తోంది.

తాజాగా పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్.. కేజ్రీవాల్, ఆప్ పంజాబ్ కన్వీనర్ భగవంత్ మాన్‌ సమక్షంలో అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2029 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌లో కున్వర్ సింగ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆయన రాజీనామాను తొలుత తిరస్కరించినా ఆ తర్వాత ఆమోదించారు.

కాగా, 2015లో పంజాబ్‌లో జరిగిన కోట్కపుర పోలీసు కాల్పుల ఘటనపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి కున్వర్ సింగ్ కీలకంగా ఉండడం గమనార్హం. సిట్ ఇచ్చిన దర్యాప్తు నివేదికను హైకోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో కున్వర్ సింగ్ రాజీనామా చేశారు. కాగా, కున్వర్ సింగ్‌ను ఏ రాష్ట్రం నుంచి బరిలోకి దింపాలన్న విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామన్నారు.