భద్రతా దళాల్లో లక్షకుపైగా పోస్టుల ఖాళీలు..

భద్రతా దళాల్లో లక్షకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎక్కువగా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌), బీఎస్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌లో ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది. పదవీ విరమణ, మరణాలు, రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయని ఈ క్రమంలో సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా బీఎస్‌ఎఫ్‌లో 28,926 ఖాళీలు ఉన్నాయన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో 26,506, సీఐఎస్‌ఎఫ్‌లో 23,906, ఎస్ఎస్‌బీలో 18,643, ఐటీబీపీలో 5,784, అస్సాం రైఫిల్స్‌లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో చాలా వరకు కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులేనన్నారు.

వీటన్నింటిని నిబంధనల ప్రకారం నేరుగా నియామకాలు చేప్టడం ద్వారా, ప్రమోషన్లు, డిప్యూటేషన్ల ద్వారా భర్తీచేస్తున్నామని తెలిపారు. మరికొన్నింటికి కొత్తగా నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం 60,210 కానిస్టేబుల్‌, 2,534 ఎస్ఐ పోస్టులు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ద్వారా.. 330 అసిస్టెంట్‌ కమాండెట్స్‌ పోస్టుల్ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.