ఆందోళనకరంగా లాలూ ఆరోగ్యం..

ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఆందోళకరంగా ఉందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ తెలిపారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. పశు దాణా కుంభకోణం కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే షుగర్ వల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. 20 ఏళ్లుగా ఆయనకు షుగర్ ఉంది. దీంతో కిడ్నీలు దెబ్బతింటూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని లాలూ చికిత్స పొందుతున్న రాంచీలోని రిమ్స్ అధికారులకు ఉమేశ్ ప్రసాద్ రాతపూర్వకంగా తెలియజేశారు. లాలూ కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పని చేస్తోందని తాను గతంలోనే చెప్పానని ఉమేశ్ ప్రసాద్ అన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైనా విషమించవచ్చని అన్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులకు తెలియజేశానని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. లాలూ ప్రసాద్ కిడ్నీ పనితీరు మరింత దిగజావచ్చు అని పేర్కొన్నారు.

డయాబెటిస్ కారణంగా కిడ్నీ దెబ్బతిన్నందున ఇతర వైద్యం కోసం మరోచోటికి తరలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే అదీ తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. వ్యాధిని ఏ మందూ నయం చేయలేదని ప్రసాద్ అన్నారు. రిమ్స్‌లో కాకుండా మరో చోట చికిత్స చేయించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అన్నారు. రిసెడెంట్ నెఫ్రాలజిస్టును సంప్రదించి చికిత్సపై నిర్ణయానికి రావాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు.