బంగారం ముక్కల కోసం ప్రజలను మోసం చేసిన ఎల్డీఎఫ్‌: ప్రధాని మోదీ

కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలక్కాడ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేరళ ప్రజలను మోసం చేసినట్లు ఆరోపించారు. బైబిల్‌లో ప్రాచుర్యం పొందిన ఓ సువార్తను గుర్తు చేసిన మోదీ.. కొన్ని ముక్కల వెండి కోసం యేసు క్రీస్తును జుడాస్ మోసం చేసినట్లే.. కొన్ని బంగారు ముక్కల కోసం ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేరళ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దీవించాలని కోరేందుకు ఇక్కడ వచ్చినట్లు ఆయన చెప్పారు. చాలా ఏళ్ల నుంచి కేరళ రాజకీయాల్లో యూడీఎఫ్‌, ఎల్డీఎఫ్ మధ్య ఫ్రెండ్లీ బంధం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏందంటూ కేరళ ప్రజలు అడుగుతున్నారని, యూడీఎఫ్‌-ఎల్డీఎఫ్ ఎలా మోసం చేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌, లెఫ్ట్ ఒకటే అని, యూపీఏ-1లో వాళ్లు భాగస్వాములని, యూపీఏ-2లో కాంగ్రెస్‌కు వామపక్షాలు సహకరించాయని, కానీ కేరళలో మాత్రం ఎన్నికల వేళ వాళ్లు ప్రత్యారోపణలు చేసుకున్నట్లు మోదీ చెప్పారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్‌.. దేశాన్నిఆధునీకరించారని, కనెక్టివిటీ పెంచేందుకు అద్భుతమైన పనిచేశారని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అన్ని వర్గాల ప్రజలు ఆయన్ను ఆదరిస్తారన్నారు. కేరళ ప్రగతి కోసం ఆయన అంకితమయ్యారన్నారు. కేరళ పుత్రుడిగా .. శ్రీధరన్ అసామాన్య పనులు చేశారని, తన లక్ష్యాలకు కట్టుబడి ఉన్నారని మోదీ తెలిపారు.

కేరళలో ఫాస్ట్(FAST) డెవలప్మెంట్ జరగాలని, దానికి సమయం ఆసన్నమైందన్నారు. ఎఫ్ అంటే ఫిషరీస్‌-ఫర్టిలైజర్స్‌, ఏ ఫర్ అగ్రికల్చర్‌-ఆయుర్వేద, ఎస్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్‌, టీ ఫర్ టూరిజం-టెక్నాలజీ అని మోదీ తెలిపారు. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు ఎంఎస్‌పీ ఇస్తానని హామీలు ఇచ్చేవని, కానీ తమ ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. కేరళలో టూరిజంకు అవినాభావ సంబంధం ఉందని, కానీ యూడీఎఫ్‌, ఎల్డీఎఫ్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైనట్లు ఆరోపించారు. టెక్నాలజీ జోడించడం ద్వారా కేరళ పర్యాటకాన్ని డెవలప్ చేయాలని మోదీ అన్నారు.