కరోనా నేర్పిన పాఠం.. ఒక్కరిపైనే ఆధారపడడం ప్రమాదం

అంతర్జాతీయ సప్లై చైన్‌ ఒకే దేశంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో కరోనా వైరస్‌ మనకు నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డెన్మార్క్‌ ప్రధాని మెటి ఫ్రెడరిక్‌సన్‌తో సోమవారం జరిగిన వర్చువల్‌ ద్వైపాక్షిక సమావేశంలో ఏ దేశం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విధానంలో మార్పులు తెచ్చేందుకు తాము జపాన్‌, ఆస్ట్రేలియాలతో కూడా కలిసి పనిచేయడం ప్రారంభింస్తున్నామని వెల్లడించారు. కలిసి వచ్చే ఇతర దేశాలు కూడా తమతో జత కలవవచ్చని తెలిపారు.

భారత్‌- డెన్మార్క్‌ ద్వైపాక్షిక సమావేశం సోమవారం వర్చువల్‌గా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డెన్మార్క్‌ ప్రధాని మెటే ఫ్రెడెరిక్‌సన్‌తో మాట్లాడారు. చైనా పేరును ప్రస్తావించకుండా ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రెండో వైజ్ఞానిక సదస్సును భారత్‌లో నిర్వహించాలన్న డెన్మార్క్‌ ప్రధాని ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు.