రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం

• ‘యువశక్తి’ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్
స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన నింపిన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన రణస్థలంలో యువశక్తి తడాఖా చూపించబోతోందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చేలా, ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో నిర్వహించబోయే ‘‘యువశక్తి’’ కార్యక్రమం పోస్టర్లను సోమవారం హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యువతరాన్ని అత్యధికంగా కలిగిన దేశంగా భారతదేశానికి పేరు. దేశానికి వెన్నెముక వారు. ఉత్తరాంధ్ర యువతరం వలసల బాట పడుతోంది. చదువులకు సైతం వేరే ప్రాంతాలకు వారు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఉపాధి దొరక్క పొట్ట చేతపట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వలసలు, ఉపాధి లేమి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు, ఇతర సమస్యలపై అన్నీ అంశాలపై సమగ్రంగా యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు యువశక్తి కార్యక్రమం వేదిక అవుతుంది. ఎలాంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది.. ప్రభుత్వ పాలసీలు ఎలా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాలు యువత తెలియజేసేందుకు యువశక్తి వేదిక గళమవుతుంది. నాతోపాటు వేదికపై 100 మంది యువతీయువకులు కూర్చొని, ఉత్తరాంధ్ర పరిస్థితులు, సమస్యలతోపాటు కష్టాల నుంచి విజయాలు సాధించిన గొప్ప స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా కార్యక్రమం ఉంటుంది. ఉత్తరాంధ్ర యువత కలలుగనే రేపటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది వారే ఆవిష్కరిస్తారు. వారి ఆలోచనలను, ఆవేదనలను వారి గొంతు నుంచే విందాం. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి.. ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక్కటే ‘మన యువత… మన భవిత’ అనేదే ప్రధాన నినాదంగా యువశక్తిని విజయవంతం చేద్దాం’’ అన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు నాగబాబు , పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, కార్యక్రమాల కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.