1200 ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీ విజయం..

యావత్ దేశం ఆసక్తి చూపించిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజయం సాధించారు. ఆమె తన ప్రధాన ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారిపై పన్నెండు వందలకు పైచిలుకు ఓట్ల తేడాతో నెగ్గారు. ఈ ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మమత, సువేందు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఒక రౌండ్ లో మమతా ఆధిక్యంలో ఉంటే, మరో రౌండులో సువేందు ఆధిక్యంలోకి వస్తుండడంతో విజయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మమత ఇక్కడ ఎలా గెలుస్తారో చూస్తానని సువేందు ఎన్నికలకు ముందు సవాల్ విసిరి ఉండడంతో, మమతకు పరాభవం తప్పదేమోనన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే అన్నింటినీ పటాపంచలు చేస్తూ మమతా బెనర్జీ విజయం కైవసం చేసుకున్నారు. అటు, అధికార టీఎంసీ పశ్చిమ బెంగాల్ లో మరింత ముందంజ వేసింది. ప్రస్తుతం 67 స్థానాల్లో గెలిచి 140 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అదే సమయంలో బీజేపీ 11 స్థానాల్లో నెగ్గి 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.