మమత Vs అమిత్‌షా.. ఒకే ప్రాంతంలో ఇద్దరి ర్యాలీలు

 పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం వేడుక్కుతోంది. ఇప్పటికే అధికార తృణమూల్‌, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రచారం సైతం హోరాహోరీగా నిర్వహిస్తున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో గురువారం దాదాపు ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇద్దరు వేర్వేరు ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. కొద్ది దూరంలోనే ఇద్దరు ముఖ్యనేతల కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన బుధవారమే బెంగాల్‌కు చేరుకున్నారు. గురువారం కపిల్​ ముని ఆశ్రమాన్ని సందర్శించి.. అక్కడి నుంచి నామ్‌ఖానాకు చేరుకుంటారని రాష్ట్ర బీజేపీ సీనియర్​ నేత ఒకరు తెలిపారు. ఓ వలస కార్మికుడి ఇంట్లో భోజనం చేసి.. రోడ్‌షోలో పాల్గొననున్నారు.

ఇదిలా ఉండగా.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో కలిసి దక్షిణ 24 పరగరణాలలోని పైలాన్‌లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. ‘ఇది రాజకీయంగా గురువారం ముఖ్యమైన రోజు’ అవుతుందని సౌత్‌24 పగరణాల జిల్లా సీనియర్‌ నేత పేర్కొన్నారు. మమతా బెనర్జీ, అమిత్ షా ఒకే జిల్లాలో దాదాపు ఒకే సమయంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ఇదే తొలిసారి. గత దశాబ్దకాలంగా బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తన హవాను కొనసాగిస్తూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది. టీఎంసీ 22 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని గద్దె దింపి.. అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ భావిస్తోంది. 294 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి.